April 9, 2013

బాబు యాత్ర గాజువాకతో ముగింపు


విశాఖపట్నం: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జిల్లాలో ఈనెల 12వ తేదీ నుంచి చేపట్టనున్న పాదయాత్రను 27న గాజువాకతో ముగించనున్నారు. గాజువాక-షీలానగర్ మధ్య జాతీయ రహదారికి ఆనుకుని పైలాన్ నిర్మించనున్నారు. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 130 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర సాగుతుంది. చివరిరోజు రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి అనంతరం పైలాన్ ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ వాహనంలో నగరంలో ఏర్పాటుచేసే భారీ బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు.

సోమవారం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం టి.తిమ్మాపురంలో విశాఖ జిల్లా నేతలతో సమీక్ష జరిపారు. పాదయాత్ర ముగింపు, పైలాన్ నిర్మాణం, బహిరంగ సభపై చర్చించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌కు భిన్నంగా ఒక రోజు ఆలస్యంగా 12న చంద్రబాబు విశాఖ జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఆదివారాలు విశ్రాంతికి కేటాయించారు. అందువల్ల ఆయన పాదయాత్ర నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి పెందుర్తి నియోజకవర్గాల మీదుగా గాజువాక వరకే సాగుతుంది.

సమయం లేనందున విశాఖ నగరంలో పాదయాత్రను రద్దు చేశారు. గాజువాక పట్టణం వరకు మాత్రమే ఆయన పర్యటిస్తారు. ఈ నెల 26తో యాత్ర ముగించాల్సి వున్నా పైలాన్ ఆవిష్కరణ కోసం రెండు కిలోమీటర్ల దూరంలో యాత్రను నిలిపివేసి 27న తిరిగి కొనసాగిస్తారు. బహిరంగ సభ విషయంలో ఇంకా వేదిక ఖరారు కాలేదు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానమా లేదా మున్సిపల్ స్టేడియమా అన్నది ఒకటి,రెండు రోజుల్లో ఖరారు చేస్తారు. బహిరంగ సభ చారిత్రాత్మకం కావాలని చంద్రబాబు ఈ సందర్భంగా నాయకులకు ఉద్బోధించారు. పార్టీ శ్రేణులంతా బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభం నుంచి ముగింపు రోజునకు 207 రోజులు అవుతుందన్నారు. బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పేలా జన సమీకరణ చేయాలని ఆయన సూచించారు. బహిరంగ సభ ఒక్క జిల్లాకే కాక రాష్ట్ర స్థాయిలో ఉండాలని ఆయన సూచించారు.

బహిరంగ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి కమిటీని నియమించనున్నట్టు తెలిపారు. పైలాన్ నిర్మాణానికి స్థలం ఖరారు చేసి పనులు చేపడతామని పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు, యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గవిరెడ్డి రామానాయుడు, రూరల్, నగర అధ్యక్షులు దాడి రత్నాకర్, వాసుపల్లి గణేష్‌కుమార్, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, గుడివాడ నాగమణి, లాలం భాస్కరరావు, పెతకంశెట్టి గణబాబు, భరణికాన రామారావు, పప్పు రాజారావు, హర్షవర్ధన్ ప్రసాద్, పల్లా శ్రీనివాసరావు, గుడివాడ అమర్, పాశర్ల ప్రసాద్, ముత్యాలనాయుడు, సీతారామరాజు, తదితరులు పాల్గొన్నారు.

పైలాన్‌కు స్థల పరిశీలన

గాజువాక: పైలాన్ నిర్మాణానికి సోమవారం ఆ పార్టీ నాయకులు గాజువాక ప్రాంతంలో స్థల పరిశీలన జరిపారు. జాతీయ రహదారికి ఆనుకొని వున్న అగనంపూడి, కూర్మన్నపాలెం, బీహెచ్‌పీవీ ప్రాంతాల్లో నాలుగైదు స్థలాలను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావులు స్థానిక నాయకులతో కలసి పరిశీలించారు. వీటిలో అనువైన స్థలాన్ని మంగళవారం నాటికి ఖరారు చేయనున్నారు. పైలాన్ ఏర్పాటు స్థల పరిశీలనలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, నియోజకవర్గ టీడీపీ ఫైవ్‌మెన్ కమిటీ ప్రతినిధులు హర్షవర్దన్‌ప్రసాద్, పల్లా శ్రీనివాసరావు, పప్పు రాజారావు, ప్రసాదుల శ్రీనివాస్, లేళ్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.