April 9, 2013

కార్యకర్తలే పార్టీకి బలం

ఆగిరిపల్లి: నిస్వార్ధంగా, అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని టీడీపీ నాయకుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. నెక్కలంగొల్లగూడెం, ఆగిరిపల్లి గ్రామాల్లో ఆదివారం జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ అడ్రస్‌లేని వ్యక్తికి నూజివీడు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ గౌరవిస్తే అమ్ముడుపోయి ఆ వ్యక్తి పార్టీకి ద్రోహం చేశాడని కార్యకర్తలు మాత్రం పార్టీని ఎన్నడూ మోసం చేయలేదన్నారు. ప్రాణ త్యాగాలకైనా వెనుదీయని కార్యకర్తలను అన్న నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని వరంగా ఇచ్చారని సభికుల హర్షధ్వానాల మధ్య చెప్పారు. ప్రజల ముంగిటకు ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో పట్వారి వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను అమల్లోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు.

ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు, ఎస్సీ,బీసీలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించిన మహోన్నతమైన చరిత్ర తెలుగుదేశం పార్టీదేనన్నారు. రాబోయే ఎన్నికల్లో చరిత్ర పునరావృతం అవుతుందని తెలుగుదేశం పార్టీకి అధికారం తథ్యమన్నారు. దీనికి ముందుగా నెక్కలం గొల్లగూడెంలో ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆగిరిపల్లిలో పార్టీ స్తూపం వద్ద పార్టీ ప
తాకాన్ని ఆవిష్కరించారు. వడ్లమానులో ఆంజనేయస్వామి ఆలయంలో బాలయ్య కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. నెక్కలం గొల్లగూడెంలో జిల్లా టీడీపీ కార్యవర్గ సభ్యుడు మాదల నరేంద్ర ఆధ్వర్యంలో బాలకృష్ణ ను గజమాలలతో సత్కరించారు.

ఆగిరిపల్లి సభలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చిట్నేనివెంకట శివరామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు పలగాని వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు దేవినేని ఉమ, బొండా ఉమ, కేశినేని నాని, బచ్చుల అర్జునుడు, వర్ల రామయ్య, దేవినేని చంద్రశేఖర్, మాదల సత్యకుమార్, నక్కనబోయిన వేణు తదితరులు పాల్గొన్నారు. జనసంద్రమైన ఆగిరిపల్లి సినీనటుడు బాలకృష్ణ పర్యటన సందర్భంగా ఆదివారం ఆగిరిపల్లి జనసంద్రమైంది. బాలకృష్ణను చూసేందుకు పెద్దఎత్తున జనం తరలిరావడంతో వీధులు కిక్కిరిసిపోయాయి. అరగంట పాటు సాగిన కార్యక్రమం విజయవంతమై పార్టీ కార్యకర్తలు, ప్రజలు బాలకృష్ణకు అపూర్వ స్వాగతం పలికారు.