April 9, 2013

స్వగ్రామంలో బాలకృష్ణ హల్‌చల్

పామర్రు : ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ శనివారం తన అమ్మమ్మ స్వగ్రామమైన కొమరవోలు, స్వగ్రామమైన నిమ్మకూరులలో హల్‌చల్ చేశారు. కొమరవోలులో విద్యుత్‌పై పెంచిన చార్జీలను నిరసిస్తూ దేశం పార్టీ ఆధ్వర్యంలో సేకరిస్తున్న సంతకాల ఉద్యమానికి మద్దతు పలుకుతూ సంతకం చేశారు. విద్యుత్ సంక్షోభంపై దేశం పార్టీ నాయకులతో కలసి బ్లాక్ పేపర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ కోతలు, చార్జీలు పెంపుతో ప్రజలు కష్టాలను గ్రహించి వారి కష్టాలలో పాలు పంచుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నానన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అంధకారమలముకుందన్నారు.

పలువురు దేశం నాయకుల కొమరవోలులో బాలకృష్ణను కలిశారు. గన్నవరం ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు తెచ్చిన వాటర్ ట్యాంకర్లను ఆయన ప్రారంభించారు. అనంతరం స్వగ్రామమైన నిమ్మకూరు వెళ్ళి అక్కడ తన తల్లిదండ్రులు నందమూరి తారక రామారావు, బసవరామతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలతో కొద్దిసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి వర్లరామయ్య, జిల్లా దేశం ఉపాధ్యక్షుడు గొట్టిపాటి లక్ష్మీదాసు, జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షుడు పొట్లూరి వెంకటకృష్ణబాబు, మండల అధ్యక్షుడు మండపాక శంకరబాబు, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు కొనకళ్ళ బుల్లయ్య. జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, నందమూరి మన్మధరావు, కుదరవల్లి ప్రవీణ్, అనగాని మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.