April 17, 2013

పాడేరులో టీడీపీకి పూర్వవైభవం

కొయ్యూరు: పాడేరు నియోజకవర్గంలో పూర్వవైభవం తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం నాతవరం మండలం డి.ఎర్రవరం శిబిరం వద్ద జరిగిన పాడేరు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపీకి ఉందన్నారు.

తన తొమ్మిదేళ్ల పాలనలో తప్పుచేయలేదని, ఎవ్వరి చేత వేలెత్తి చూపించుకోలేదని చంద్రబాబు గర్వంగా ప్రకటించారు. గతంలో కొన్ని పార్టీలతో జరిగిన ఒప్పందాల కారణాలగా ఎంపీ, ఎమ్మెల్యేల టిక్కెట్‌లు పార్టీ నేతలకు కేటాయించలేకపోయామని, అందువల్ల కార్యకర్తల్లో నిరాశ చోటుచేసుకున్న మాట వాస్తవమేనన్నారు. రానున్న రోజుల్లో పొత్తులున్న చోట ఎమ్మెల్సీ పదవులను పార్టీ నేతలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. పార్టీ పూర్వ వైభవానికి మండల అధ్యక్షులతో కోర్‌కమిటీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.

కార్యకర్తలకు అండగా ఉండకుంటే ఎలా... కార్యకర్తల కష్టనష్టాల్లో నేతలు పాలుపంచుకోకుండా గ్రూపులు కడితే పార్టీకి నష్టమే అని చంద్రబాబు మాజీ మంత్రి మణికుమారిపై మండిపడ్డారు. కార్యకర్తల కష్టాలను తెలుసుకుంటూ వారితో మెలగాలని సూచించారు.

గిరిజనులకు కాంగ్రెస్ మొండి చేయి గిరిజనులకు న్యాయం జరగాలని కేంద్ర పాలకవర్గం అనుమతి లేకుండానే కాఫీ ప్లాంటేషన్ చేయించానని చంద్రబాబు అన్నారు. ఏజెన్సీలో విద్యకు ప్రాధాన్యతనిస్తూ అధిక నిధులు కేటాయించానని, అరకును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దానన్నారు. కాంగ్రెస్ పాలనలో వీటిని నిర్వీర్యం చేయడమే కాకుండా గిరిజనులకు పౌష్టికాహారాన్ని కూడా అందించలేని
దుస్థితిలో పాలన సాగిస్తున్నారన్నారు. నేటికీ మన్యంలో 80గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని, 240 గ్రామాలకు రహదారులు లేవని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

వారం రోజుల్లో ఇన్‌చార్జి నియమిస్తా..


ఈప్రాంతంలో ఇంకా వారం రోజులు ఉంటానని, ముఖ్యనేతలతో చర్చించి పాడేరుకు ఇన్‌చార్జిని నియమిస్తానని చంద్రబాబు ప్రకటించారు. కార్యకర్తల కోసం పనిచేసే నేతను నియమిస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. కార్యకర్తల అభివృద్ధికి తాను హామీ ఇస్తానని చంద్రబాబు తెలిపారు.

కార్యకర్తలకు కోర్టు ఖర్చుల కింద ఆర్థిక సహాయం అక్రమ కేసుల బనాయింపుతో అరెస్టు అయి బెయిల్ కోసం ఆస్తులు పోగొట్టుకున్న జెర్రెల గ్రామానికి చెందిన ఎస్.వెంకటరమణ అనే గిరిజనుడికి పార్టీఫండ్ నుంచి రూ.60వేలు అందిస్తున్నట్టు చంద్రబాబు ఈ సమావేశంలో ప్రకటించారు. అలాగే జీకేవీధి మండల పార్టీ అధ్యక్షుడు కొక్కుల పూర్ణనారాయణ పక్షవాతంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్నట్టు ఆయన దృష్టికి కార్యకర్తలు తీసుకురావడంతో ఆయన వైద్యసేవలకు రూ.25వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.