April 17, 2013

అరెస్టులు..అడ్డంకులు

(టెక్కలి/కోటబొమ్మాళి) పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ని కలిసేందుకు ప్రయత్నించిన విపక్ష నా యకులను పోలీసులు అడ్డుకున్నారు. మాజీఎమ్మెల్యే, టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ), పార్టీ అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయు డు, బోయిన రమేష్, పినకాన అజయ్‌కుమార్ తదితరులను నిమ్మాడలో గృహ నిర్బంధం చేశారు. జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు టీడీపీ నేతలు నిమ్మాడ నుంచి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఈలోగానే పోలీసులు అచ్చెన్నాయుడు ఇంటిని చుట్టుముట్టారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వేణుగోపాలనాయుడు, ఎస్ఐ అవతా రం నేతృత్వంలో 25 మంది పోలీసులు నిమ్మాడలో పహారా కాశారు.

నిమ్మాడ జంక్షన్‌లో మరో 20 మంది కాపలాగా ఉన్నారు. వినతిపత్రం అందజేసి వస్తామని, తమ వలన ఇబ్బందులేమీ ఉండవని చెప్పి బయలుదేరిన అచ్చెన్నాయు డు, బాబ్జి, అప్పలనాయుడులను పోలీసులు ఇంటిగేటు వద్దనే అడ్డగించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లనీయకపోవడం దారుణమన్నారు. టెక్కలిలో ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు టీడీపీ, సీపీఎం, సీపీఐ, ఇతర ప్రజాసంఘాల నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విపక్షాల నాయకులకు వాగ్వివాదం జరిగింది.

ఈ దశలో పోలీసులు సీపీఎం నాయకులు నంబూరు షణ్ముఖరావు, పినకాన కృష్ణమూర్తి, పోలాకి ప్రసాద్, కొల్లి ఎల్లయ్య, హనుమంతు ఈశ్వరరావు, సీపీఐ నాయకులు శెటికం వెంకట్రావు, టీడీపీ నాయకులు మామిడి రాము, పోలాకి షణ్ముఖరావుతో కలిపి 15 మందిని అరెస్టు చేశారు. సీఎం పర్యటన తర్వాత వీరిని విడిచిపెట్టారు. ఈ సందర్భంగా విపక్షాల నాయకులు విలేఖరులతో మాట్లాడుతూ పాలకవర్గాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని, ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి కోరితే అరెస్టులు చేయడం అన్యాయమన్నారు.