April 17, 2013

బాబు పాదయాత్రల్లో మళ్లీ మార్పులు

నర్సీపట్నం: చంద్రబాబు పాదయాత్ర షెడ్యూల్‌లో మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. కాళ్లనొప్పి కారణంగా నడవడానికి ఆయన తీవ్ర ఇబ్బంది పడుతుండడంతో నడిచే దూరాన్ని తగ్గించారు. మంగళవారం నాతవరం మండలం డి.ఎర్రవరం నుంచి సుమారు ఆరున్నర కిలోమీటర్లు దూరంలో వున్న నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం వరకు నడవడానికి దాదాపు ఏడు గంటలు పట్టింది. పలుమార్లు ఆగి విశ్రాంతి తీసుకున్నారు. వ్యాన్‌పై నిలబడలేక కుర్చీలో కూర్చుని ప్రసంగించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా బుధవారం బలిఘట్టం నుంచి మాకవరపాలెం మండలం గంగవరం వరకే పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.

ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బలిఘట్టం నుంచి మాకవరపాలెం మండలంలో కొండలఅగ్రహారం వరకు 14.5 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలి. కానీ దీనిని ఎనిమిది కిలోమీటర్లకు తగ్గించి గంగవరంలో రాత్రిబసకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం గంగవరం నుంచి తామ
రం వరకు పాదయాత్ర జరుగుతుందని టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ తెలిపారు. కాగా బుధవారం బలిఘట్టంలో చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు వుంటాయని ఆయన తెలిపారు.

బాబువెంట నడిచిన నేతలు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రలో చంద్రబాబు వెంట మంగళవారం జిల్లాకు చెందిన పలువురు నాయకులు నడిచారు. పొలిట్‌బ్యూరోసభ్యుడు అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్, ఎమ్మెల్యేలు రామానాయుడు, కేఎస్ఎన్ఎస్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్యేలు కాకర నూకరాజు, మణికుమారి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.