April 17, 2013

నిద్రపోతున్న పాలకులకు బుద్ధి చెప్పండి

రొద్దం : నిధులున్నా ఖర్చు పెట్టకుండా నిద్రపోతున్న పాలకులకు బుద్ధి చెప్పాలని ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పార్థసారథి ప్రజలకు పిలుపు నిచ్చారు. మండల పర్యటనలో భాగం గా రెండో రోజు నల్లూరులో గ్రామాలయ కమిటీకి ప్రహారీగోడ ప్రారంభానికి వారు వచ్చారు. వీరితో పాటు ఎ మ్మెల్సీ శమంతకమణి భూమి పూజ లో పాల్గొన్నారు. కందుకూరిపల్లి రామాలయం, ఆంజనేయస్వామి ఆలయానికి,కమ్యూనిటిభవనానికి భూమిపూజ చేశారు. అనంతరం రొద్దంలో ఎల్లమ్మ గుడికి అనుబంధంగా కమ్యూనిటి భవనం, బస్టాండు ఆవరణంలో ఎనిమిది లక్షలతో పంచాయతీ చావిడికి భూమిపూజ జరిపించారు.

పదిలక్షలతో రొద్దంలో షాదీమహల్, వాల్మీకి సంఘాల నిర్మాణాలకు భూమిపూజలు చేశారు.పెద్దపల్లిలో మారెమ్మ గుడికి భూమిపూజ చేశారు. పలు గ్రామాలలో జరిగిన సభలలో ఎంపీ మాట్లాడుతూ రైతులను అదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంకు బుద్ధిచెప్పే సమయం దగ్గర పడిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా రొద్దం మండలానికి ఏకంగా రూ.75లక్షలతో అభివృద్ధి పనులు చేప ట్టామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మరోసారి టీడీపీకే బ్రహ్మరథం పట్టాలని అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఎలా ఉండాలో చూపిస్తామన్నారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీలకు సబ్‌ప్లాన్ కమిటీ అమలు పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ గతంలో బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో పథకాల అమలు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ,ఎమ్మెల్యేల తో పాటు మండల నాయకులు వెంకటరామిరెడ్డి, నారాయణరెడ్డి, అక్కులప్ప, చిన్నప్పయ్య, రామకిష్టప్ప, మాధవనాయుడుతో పాటు అంజినేయులు, మహ్మాద్, చెన్నకేశవులు, గోవిందురాజులు తదితరులు పాల్గొన్నారు.