April 17, 2013

కేసీఆర్‌కు వేసిన ప్రతి ఓటూ మురిగిపోయినట్లే

కేసీఆర్ రాజకీయ వ్యభిచారి
ఉద్యమకారులను వదిలి ఊసరవెల్లులు టిక్కెట్లా?
తెలంగాణ టీడీపీ నేతల ధ్వజం

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమాన్ని గాలికి వదిలి ఇతర పార్టీల నాయకుల కోసం పాకులాడుతున్న కేసీఆర్.. రాజకీయ వ్యభిచారి అని టీ-టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. 'తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాల సభ్యులు కేసీఆర్ కంటికి ఆనడం లేదు. ఉద్యమకారులను వదిలి ఊసరవెల్లులకు టిక్కెట్లు ఇవ్వడానికి వెంపర్లాడుతున్నాడు. కేసీఆర్‌కు వేసే ప్రతి ఓటూ మురిగిపోయినట్లే' అని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరావు, శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు, పార్టీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

'లాబీయింగ్‌తోనే తెలంగాణ వస్తుందని కొంతకాలం.. ఉద్యమం చేస్తేనే వస్తుందని మరికొంత కాలం కేసీఆర్ ప్రచారం చేశాడు. ఇప్పుడు సీట్లు వస్తేనే తెలంగాణ వస్తుందని కొత్త ప్రచారం మొదలుపెట్టాడు. కేసీఆర్ మాటలు నమ్మి ఉద్యమం కోసం లాఠీదెబ్బలు తిని పనిచేసిన వారితో ఆయనకు పనిలేదు. ఇప్పుడు పక్క పార్టీల వారి కోసం పాకులాడుతున్నాడు. జేఏసీకి ఇవి కనిపించవా? ఉద్యమాన్ని గాలికి వదిలి ఫాంహౌస్‌లో పడుకొంటే ఎందుకిలా చేస్తున్నావని ఎందుకు నిలదీయట్లేదు? టీడీపీ తెలంగాణ కోసం లేఖ ఇచ్చింది. రాజీనామాలు చేసింది. ఉద్యమాల్లో పాల్గొంది.

అయినా కేసీఆర్ టీడీపీని శత్రువుగా చేసి.. కాంగ్రెస్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. అమ్ముడుపోయాడు' అని ఎర్రబెల్లి విమర్శించారు. ఒకప్పుడు ఇతర పార్టీల నాయకులంటే లెక్క లేనట్లు మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు వారినే తన పార్టీలోకి రమ్మని గడపగడపకూ తిరుగుతున్నాడని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. 'చేతగాని దద్దమ్మలు, చవటలే కేసీఆర్ పంచన చేరుతున్నారు. అచ్చమైన టీడీపీ వాడెవడూ చేరట్లేదు. కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజలను దొరలపాలన కిందకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.

తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటాడు. అదే నిజమైతే గద్దర్ పేరు ప్రకటించు. విమలక్క పేరు ప్రకటించు. దానికి నోరు రాదు. నీ బైరూపు వేషాలు ప్రజలు నమ్మేరోజులు పోయాయి' అని ఆయన అన్నారు. సోనియాగాంధీకి భయపడి పార్లమెంటులో నోరు తెరవడం లేదని, ఆమెను ఒక్క మాటంటే బొక్కలో తోయిస్తుందని భయమని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో వైఎస్, కేసీఆర్ కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని, ఒక కుటుంబం లక్షల కోట్లు సంపాదిస్తే మరో కుటుంబం వేల కోట్లు సంపాదించిందని ఆయన ఆరోపించారు.