April 8, 2013

సబితను అరెస్టు చేయాలి!

కేబినెట్ నుంచి ఉద్వాసన పలకాలి
సెక్రటేరియట్‌లో మరికొందరు 'దొంగలు'
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు ధ్వజం

కాకినాడ : జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలైన హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అరెస్టు చేయాలని, ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. వాన్‌పిక్ అవినీతిలో ప్రమేయం ఉన్న ధర్మాన ప్రసాదరావుపై కూడా వేటు వేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకూ నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం టి. తిమ్మాపురం ఎస్సీ కాలనీ నుంచి సోమవారం చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు.

తిమ్మాపురం, తేటగుంట సెంటర్, రాజుల కొత్తూరుల మీదుగా ఆయన నడక సాగించారు. వైఎస్ హయాంలో గనుల శాఖను నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును దాల్మియా సిమెంట్‌కు లబ్ధి చేకూర్చిన వ్యవహారంలో ముద్దాయిగా సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొన్న అంశాన్ని యాత్రలో ప్రధానంగా ప్రస్తావించారు. కరెంటు సమస్యలపై తెలుగుదేశం సంతకాల సేకరణ చేపట్టగా, లక్ష కోట్లు దోచుకుని జైల్లో ఉన్న జగన్‌ను విడిపించుకోవడానికి వైసీపీ సంతకాలు సేకరిస్తున్నదని ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో అవినీతికి పాల్పడిన వాళ్లలో కొంతమంది జైల్లో ఉంటే కొందరు సెక్రటేరియట్‌లో ఉన్నారన్నారు.

అక్రమార్కులందరినీ అరెస్టుచేస్తే చంచలగూడ జైల్లోనే క్యాబినెట్ సమావేశం పెట్టుకోవాల్సి ఉంటుందని ఎద్దేవాచేశారు. అవినీతిలో ప్రమేయం ఉన్న మంత్రులను కాపాడే పనిలో సీఎం బిజీగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. వచ్చే ఎన్నికలలో పిల్లకాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుంటే ఢిల్లీలో తాకట్టుపెట్టి జగన్ జైలు నుంచి బయటపడటానికి ఉపయోగించుకుంటారన్నారు. తాము ప్రతిపాదించిన నగదు బదిలీ పథకానికి కేంద్రం చెబుతున్న స్కీంకూ సంబంధమే లేదని తేటగుంట సెంటర్‌లో జరిగిన సభలో అన్నారు.

తనకు ఉపాధి పథకం పని చూపించడం లేదని ఓ మహిళ చంద్రబాబుకు విన్నవించగా.. పనితో సంబంధం లేకుండా నెలకు రూ. 15 వేలు కూలీల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. దీని వల్ల ఉపాధి హామీ అవినీతిని అరికట్టవచ్చని, వ్యవసాయ పనులకు ఆటంకం లేకుండా ఉపాధికూలీలు అటు మళ్లడానికి అవకాశం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక ఉచిత బియ్యం పథకం ప్రారంభిస్తామని వెల్లడించారు. బుద్ధి ఉన్నవాడెవడూ ప్రాజెక్టులేకుండా కాల్వలు తవ్వరని, కానీ, జగన్‌కి దోచిపెట్టడం కోసం వైఎస్ ఆ పని చేశారని దుయ్యబట్టారు.

కాగా, పాదయాత్రకు ముందు టి. తిమ్మాపురంలో కైట్ ఇంజనీరింగ్ విద్యార్థుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నాడు బిల్‌గేట్స్ కుదరదని చెప్పినా.. పట్టుబట్టి తాను పది నిమిషాల అపాయింట్‌మెంట్ తీసుకోవడం వల్లే హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో జగన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. "రాష్ట్రంలో చదువుకోని వారు సమర్థిస్తున్నారంటే ఏమోలే అనుకోవచ్చు. చదువుకున్న వాళ్లూ జగన్‌ను సమర్థించడాన్ని నమ్మలేకపోతున్నాను'' అని వ్యాఖ్యానించారు.

'నాయకుడన్న వాడికి విజన్ ఉండాలి. పీవీ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల దేశంలో అభివృద్ధికి నాందిపడింది. అయితే దాన్ని కొనసాగించడంలో నాయకులు విఫలమయ్యారు. వైఎస్ సీఎంగా ఉన్నపుడు కొడుకు జగన్‌కు లక్ష కోట్లు దోచి పెట్టాలని విజన్ పెట్టుకున్నాడు'' అని దుయ్యబట్టారు. "కుటుంబ నియంత్రణ, మహిళా అక్షరాస్యత, డ్వాక్రా తదితర ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. కుటుంబ నియంత్రణ, మహిళా అక్షరాస్యత వల్ల సంపద పెరిగింది.

ఐటీ అభివృద్ధితో నక్సలిజం వైపు వెళ్లే యువత ఉద్యోగాల వైపు మళ్లింద''ని చెప్పుకొచ్చారు. అనంతరం పాదయాత్ర ముగింపు సభ, ఇతర సన్నాహాల గురించి విశాఖ జిల్లా ముఖ్యనేతలతో టీ. తిమ్మాపురంలోని తన బసలో చంద్రబాబు సమీక్ష జరిపారు. ఇదే సమావేశంలో విశాఖలో ఆయన పాదయాత్ర రూట్‌మ్యాప్ ఖరారు చేశారు.