April 8, 2013

ఎన్టీఆర్ అందరివాడు! ఇంటింటా ఆయన ఫొటోలున్నాయి


వాటిని తేసేయాలని చెబుతామా?
వివాదంతో జూనియర్‌కు సంబంధంలేదు
తీవ్ర పరిణామాలుంటాయంటున్నారు..
నవ్వాలో, బాధపడాలో అర్థం కావడం లేదు
హరికృష్ణ ఘాటు వ్యాఖ్యలు
బావ, తమ్ముడిపై పరోక్ష విమర్శలు

హన్మకొండ: 'ఎన్టీఆర్ అందరి వాడు' అని ఆయన తనయుడు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ పేర్కొన్నారు. బావ చంద్రబాబుపైనా, తమ్ముడు బాలకృష్ణపైనా పరోక్ష విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ ఫొటోను వాడుకోవడం రాజకీయ వ్యభిచారమైతే... ఆయన ఫొటోను పక్కన పెట్టేయడం ఏ వ్యభిచారమవుతుందని ప్రశ్నించారు. సోమవారం హన్మకొండలోని వేయి స్తంభాలగుడిలో ప్రత్యేక పూజలు చేసిన హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. విజయవాడ, గుంటూరులలో వైసీపీ ఫ్లెక్సీలలో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు వాడటంతో మొదలైన వివాదంపై స్పందించారు.

'ఎన్టీఆర్ ఫొటోను ఏ పార్టీ వారైనా వాడుకోవచ్చని అనను' అని అంటూనే.. 'రామారావుగారు దేవుడితో సమానం. భారదేశ చరిత్రలోనే కాదు.. మానవ జాతి మనుగడ ఉన్నంతవరకు అటువంటి మనిషి పుట్టడు. పుట్టబోడు. ఆయన అందరి మనిషి' అని తేల్చేశారు. "మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్ర ఫొటోను ఇంటింటా పెట్టుకున్నారు. ఆ మహామనిషి ప్రజల హృదయాల్లో ఉన్నారు.

ఇప్పుడు వెళ్లి ఆ ఫొటోలను తీసేయాలని చెబుతామా? ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి ఉన్నత పదవులు అలంకరించిన ఎంతో మంది ఆ తర్వాత ఆయన ఫొటోను తమ కార్యాలయాల్లో పెట్టుకోలేదు. దీనిని ఏ వ్యభిచారం అనాలి?'' అని హరికృష్ణ ప్రశ్నించారు. ఇది తమ కుటుంబ వివాదంగా మారడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల వివాదంపై వివరణ ఇవ్వకుంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్‌కు బాలకృష్ణ స్పష్టం చేసిన అంశంపై హరికృష్ణ స్పందించారు. "ఆరోజు గుడివాడ ఎమ్మెల్యే నాని పార్టీని వీడి వెళ్లిపోయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తనకు తానుగా మీడియాను పిలిచి.. దీంతో తనకు సంబంధం లేదని చెప్పారు.

తాతగారు పెట్టిన పార్టీలోనే ఉంటాను.. ఉంటున్నాను అని చెప్పారు. రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఎందరో అభిమానులు ఉన్నారు. వారిలో వివిధ పార్టీలకు చెందిన వారు ఉంటారు. ఇవాళ ఎవరో అభిమాని ఫ్లెక్సీ పెట్టారు. అభిమానులను మనం కాదంటామా? వద్దంటే వారు వింటారా! దీనిపై తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించడం సరికాదు. దీనికి నవ్వాలా బాధపడాలా నాకర్థం కావటంలేదు'' అన్నారు. తీవ్ర పరిణామాలుంటాయని అనడాన్ని సంఘం హర్షించదని, నోటికి వచ్చింది మాట్లాడటం సరికాదని అన్నారు.

"కాంగ్రెస్ పార్టీ అయినా, మా నాన్న స్థాపించిన పార్టీ టీడీపీ అయినా, వైసీపీ అయినా నేను అడగబోయే ప్రశ్నలకు బజారులోకి వచ్చి సమాధానం చెప్పాలి. ప్రజల్లో నిలబడి మాట్లాడుకుందాం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజల్లోనే తేల్చుకుందాం'' అని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి తాను, తన కుటుంబం ఎప్పుడూ ముందుంటాయని హరికృష్ణ స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ టీడీపీ సొత్తు: కళా వెంకట్రావు

కాకినాడ: ఎన్టీఆర్ టీడీపీ సొత్తు అని ఆ పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. వైసీపీ నేతలు తమ ఫ్లెక్సీలు వాడటం సరికాదన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలపై మాత్రం స్పందించబోనన్నారు.

పూజనీయుడిగా..
మహాత్మాగాంధీ, పూలే, జయప్రకాశ్ నారాయణ్.. వీరందరూ కులాలకు, మతాలకు, వర్గాలకూ అతీతంగా యావద్దేశం పూజించుకునే మహనీయులు. వీరితో పోల్చలేకపోయినప్పటికీ ఆంధ్రదేశానికి, తెలుగు ప్రజానీకానికి రామారావుగారు కూడా అంతటి పూజ్యనీయులే. ఈనేప«థ్యంలో అందరి హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న రామారావుగారి ముద్రను తెలుగు వారి హృదయాలనుంచి చెరిపివేయలేరు. కోట్లాదిమంది పూజించుకునే రామారావుగారి బిడ్డగా దానిని నేను గౌరవంగా భావిస్తాను. ఆయన బిడ్డగా పుట్టడం ఈ ఒక్క జన్మ సుకృతం కాదని జన్మజన్మల సుకృతమని గతంలో చాలా సార్లు చెప్పాను. (ఆదివారం మీడియాతో మాట్లాడుతూ...)

ఒక వివాదం...
దర్శకుడు శ్రీను వైట్ల తన సినిమాల్లో ఎవరో ఒకరిని లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేస్తారని సినీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే... జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్‌షా' సినిమాలో ఆయన బాబాయి, సినీ హీరో బాలకృష్ణపైనే బ్రహ్మానందం క్యారెక్టర్‌తో సెటైర్‌లు వేయించినట్లు చెబుతున్నారు. 'శ్రీమన్నారాయణ' సినిమాలో బాలయ్య 'డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్, ది ట్రబుల్ ట్రబుల్స్ యు' అనే డైలాగ్‌ను వాడుకున్నారు. 'ట్రబుల్' స్థానంలో 'ఫైర్' అనే పదం పెట్టి 'డోన్ట్ ఫైర్ ది ఫైర్. ఇఫ్ యు ఫైర్ ది ఫైర్, ది ఫైర్ ఫైర్స్ యు' అని బ్రహ్మానందం హెచ్చరిస్తారు.

ఒక ప్రచారం..
'బాద్‌షా' సినిమాకు హిట్‌టాక్ వచ్చింది. దాదాపు అన్ని చోట్లా హౌస్‌ఫుల్‌గా నడుస్తోంది. అయితే... సినీ అభిమానాన్ని సీరియస్‌గా తీసుకునే కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య 'ఫ్లెక్సీల వివాదం'తో దూరం పెరిగింది. దీంతో... 'బాద్‌షా' అంత బాగాలేదు, చూడొద్దు అంటూ బాలయ్య అభిమానులు 'మౌత్ టాక్' స్ప్రెడ్ చేస్తున్నారట! ఇక... 'బాద్‌షా' సినిమా సూపర్ డూపర్ బంపర్ హిట్ అనిపించేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు యథాశక్తి కృషి చేస్తున్నారట! తామే పదుల సంఖ్యలో టికెట్లుకొని క్రేజ్‌ను మరింత పెంచుతున్నారని మరో 'టాక్'!