April 8, 2013

నేడు రాష్ట్ర బంద్ విద్యుత్ సమస్యలపై విడివిడిగా పార్టీల పిలుపు


తూర్పుగోదావరిలో పాల్గొంటున్న బాబు
విజయవంతం చేయాలన్న కిషన్‌రెడ్డి
సర్కారుకు ప్రణాళిక లేదు: నారాయణ
బంద్‌కు టీఆర్ఎస్, జేఏసీల మద్దతు
పారిశ్రామిక సంస్థలదీ అదే బాట..
హైదరాబాద్ ఆటో జేఏసీ కూడా..
ఓయూ, కేయూ పరీక్షలు వాయిదా
విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ
రైళ్ల రాకపోకలు యథాతథం

హైదరాబాద్ : విద్యుత్ చార్జీల పెంపు, సర్‌చార్జీల మోత, కోతలకు నిరసనగా తామిచ్చిన పిలుపు మేరకు మంగళవారం బంద్‌ను విజయవంతం చేయడానికి విపక్షాలు సర్వసన్నద్ధమయ్యాయి. బంద్‌ను జయప్రదం చేయాలని అన్ని పార్టీల అగ్రనేతలూ కోరారు. అధికార కాంగ్రెస్ మినహా దాదాపు మిగిలిన పార్టీలు, సంఘాలన్నీ బంద్‌కు సానుకూలంగా ఉండటం, విద్యుత్ సంక్షోభంపై సాధారణ ప్రజలు, కుటీర పరిశ్రమలు సహా అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం కావడంతో బంద్ విజయవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

విద్యుత్ కష్టాలకు నిరసనగా టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిందని, బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తిచేశారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో ఆయన బంద్‌లో పాల్గొంటారు. మంగళవారం బంద్‌లో తామూ పాల్గొంటామని టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. బంద్‌కు అందరూ సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. విద్యుత్ సంక్షోభం తీవ్రత దృష్ట్యా ప్రజలు స్వచ్ఛందంగానే బంద్‌లో పాల్గొంటారని వివిధ పార్టీలు భావిస్తున్నాయి. విపక్షాల బంద్ నేపథ్యంలో ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు తమ పరిధిలో మంగళవారం జరిగే అన్ని పరీక్షలను వాయిదావేశాయి.

ఓయూలో వాయిదా పడిన పరీక్షను ఈనెల 30న నిర్వహిస్తారు. కాగా.. విపక్షాలు బంద్‌కు పారిశ్రామిక సంస్థలు మద్దతు ప్రకటించాయి. కోతల వల్ల చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మూసేయాల్సి వస్తోందని తెలంగాణ పారిశ్రామికుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి అన్నారు. బంద్‌కు మద్దతుగా చర్లపల్లి సబ్‌స్టేషన్ ముందు పారిశ్రామికవేత్తలు సోమవారం ధర్నా చేశారు. వనరులు అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడం వల్లే విద్యుత్ సంక్షోభం తలెత్తిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. హైదరాబాద్ ఆటో జేఏసీ కూడా బంద్‌కు మద్దతు తెలిపింది.

ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను ఎత్తేయాలి: కోదండరాం
తెలంగాణలోని ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను ఎత్తేసి.. ప్రభుత్వమే విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు సరఫరా చేయాలని జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్‌చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని, విద్యుత్ కోతలను ఎత్తివేయాలని కోరారు. మంగళవారం చేస్తున్న బంద్‌కు జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఆంధ్రా ప్రాంత రైతులకు 7 గంటల పాటు నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేస్తూ తెలంగాణ రైతులకు మాత్రం 3-4 గంటలే ఇస్తోందని ఈటెల రాజేందర్ కోరారు.

హింసకు పాల్పడితే చర్యలు: డీజీపీ
బంద్ సందర్భంగా హింసాత్మక సంఘటనలకు పాల్పడేవారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని డీజీపీ దినేష్‌రెడ్డి హెచ్చరించారు. బంద్ నేపథ్యంలో సోమవారం ఆయన తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచే బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీలను డీజీపీ ఆదేశించారు. విద్యార్థుల పరీక్షలకు ఇబ్బందులు కలగకుండా, ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ ఆస్తులపై ఆందోళనకారులు దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రైళ్ల రాకపోకలు యథాతథం
బంద్ నేపథ్యంలో.. పోలీసు బందోబస్తుతో రైళ్లను యథాతథంగా నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లతో పాటు.. ఎంఎంటీఎస్ సర్వీసులన్నింటినీ ఎప్పట్లాగే నడపాలని అధికారులు నిర్ణయించారు.