March 20, 2013

కాటన్ స్మరణతో రాజమండ్రిలోకి..

ఆయన ఇక్కడ పుట్టలేదు. ఈ మట్టితో బం«ధం లేదు. మన జాతివాడు కూడా కాదు. కానీ... మీ కన్నా, నాకన్నా ఎక్కువగా తెలుగోడి గుండెలో గుడి కట్టుకున్నాడు. విశ్వ మానవుడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. రాజమండ్రి బ్రిడ్జిపై నడుస్తూ దూరంగా ధవళేశ్వరం బ్యారేజీని చూసినప్పుడు కలిగిన భావమిది. ఒక ముద్ద అన్నం పెట్టినవాడినే మనం మరిచిపోలేం. అలాంటిది.. ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా రూపుదిద్దిన సర్ ఆర్థర్ కాటన్‌ని ఎవరు మరిచిపోతారు! ఒకనాడు కరువులతో, వలసలతో తల్లడిల్లిన గోదావరి జిల్లాల్లోకి జలరాశు లను తరలించిన ఆ బ్రిటిష్ అధికారి పేరు.. ఈ రాష్ట్రం ఉన్నంతవరకు చిరస్మరణీయమే!

కాటన్ స్మరణతో రాజమండ్రిలో అడుగుపెట్టాను. ఠీవిగా నిలిచిన వీరేశలింగం పంతులు విగ్రహాన్ని దారిలో చూసి స్ఫూర్తి పొందాను. ఆయన ధీరత్వమే తెలుగు జాతికి వరం. ఆదికవి నన్నయ తిరిగిన ఈ నేలపై అడుగులు వేయడం ఒకరకమైన ఉత్సాహాన్ని నాలో కలిగించింది. ఎదురుగా వచ్చిన వస్త్ర వ్యాపారులను చూసినప్పుడు మరింత సంతోషం కలిగింది. ఈ గడ్డపై మరోసారి వారితో గొంతు కలపగలిగాను. వీరి పట్టుదలను ఎవరైనా అభినందించాల్సిందే. ప్రభుత్వం మాత్రం అరెస్టులు, ఆంక్షలంటూ వేధించుకుతింటోంది. వ్యాట్‌పై నిర్ణయం ఇక ప్రజలదే. వాళ్ల సహకారం లేకుండా ఈ ఉద్యమం ముందుకు పోదు. వ్యాట్‌ను అందరి సమస్యగా గుర్తించినప్పుడే అది సాధ్యం! ఇది రెండువైపులా జరగాల్సిన ప్రయత్నం. అప్పుడిక ఈ ప్రభుత్వానికి చేయడానికేం ఉండదు...తప్పుకోవడం తప్ప!