March 20, 2013

చంద్రన్నకు పసుసు తోరణాల ... స్వాగతం

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర నేటి నుంచి జిల్లాలో జరగనుంది. 'వస్తున్నా మీ కోసం' పేరుతో చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర 169 రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు 2 వేల 434 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 170వ రోజు పాదయాత్రతో జిల్లాలో అడుగుపెట్టనున్నారు. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు కొవ్వూరు నుంచి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మీదుగా చంద్రబాబు రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రిలో కోటిపల్లి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడతారు.

ఆయా వర్గాలు వేర్వేరుగా నిర్వహిస్తున్న ఎంబీసీ, మాల, మాదిగ, మేదర, బీసీ వర్గాల సమావేశాలలో ఆయన పాల్గొంటారు. రెండో రోజు గురువారం కూడా రాజమండ్రిలోనే యాత్ర సాగుతుంది. మూడో రోజు కడియం వరకు సాగుతుంది. అక్కడ నుంచి మండపేట, అనపర్తి, పెదపూడి, పెద్దాడల మీదుగా సాగుతూ కాకినాడ రూరల్ గ్రామాల మీదుగా కాకినాడ చేరుకుంటారు. అక్కడ నుంచి రమణయ్యపేట, అచ్చంపేటల మీదుగా పిఠాపురం చేరుకుంటారు. ఈనెల 29 నాటికి చంద్రబాబు పాదయాత్ర పిఠాపురం చేరుకునేలా ప్లాన్ చేశారు. అదే విధంగా 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని అక్కడ నిర్వహించనున్నారు. టీడీపీ ఆవిర్భవించి ముప్పయ్ ఒక్క సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 31 అడుగుల పైలాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా దీన్ని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.