March 20, 2013

అవినీతి సొమ్ము కక్కించి పేదలకు పంచుతా

అధికారం ఇవ్వండి 6 నెలల్లో గాడిలోకి!
మహనీయుల పక్కన వైఎస్ విగ్రహమా?
కేంద్రంతో సమంగా రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు
'తూర్పు'లో చంద్రబాబు పాదయాత్ర
రాజమండ్రిలో పొంగిన 'జన గోదారి'

 కాకినాడ/ఏలూరు : అధికారం ఇస్తే ఆరు నెలల్లో రాష్ట్రాన్ని గాడిలో పెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ అవినీతి, అసమర్థ, దొంగల, రౌడీల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు టీడీపీని గెలిపించాలని కోరారు. పశ్చిమ గోదావరి నుంచి సాయంత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఆయన అడుగుపెట్టారు. రాజమండ్రి బ్రిడ్జి వద్ద బ్రహ్మాండమైన స్వాగతం లభించింది. వేలాది కార్యకర్తలు, అభిమానుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా 'జన గోదావరి'ని తలపించింది.

మోటార్ సైకిల్ ర్యాలీలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సమయంలోనే కాకుం డా దీనికిముందు కొవ్వూరులో కూడా కాంగ్రెస్, వైసీపీల తీరును చంద్రబాబు తూర్పారబట్టారు. రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్, ఎన్టీఆర్, వీరేశలింగం విగ్రహాల కూడలివద్ద మాట్లాడారు. "రాష్ట్రంలో గజదొంగలు పడ్డారు. వైఎస్ సీఎంగా ఉన్నపుడు కొడుకు తప్పుల్ని వెనకేసుకొచ్చారు. లక్షల కోట్లు దోచిపెట్టారు. ఆ సొమ్మును రికవరీ చేసి పేదలకు పంచాలి. త్వరలోనే పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ లో కలిసిపోతుంది'' అన్నారు.

కాటన్, వీరేశలింగం, అంబేద్కర్, అల్లూరి, గాంధీ, ఫూలే, ఎన్టీఆర్ వంటి మహనీయుల విగ్రహాలు చూసి వారి మంచిని చెప్పుకుంటాం. కానీ, లక్షల కోట్లు దోచిపెట్టిన వైఎస్ విగ్రహాలు చూపించి రేపు మీ పిల్లలకు ఏం చెప్తారు?'' అని ప్రజలను ప్రశ్నించారు. ఆటో డ్త్రెవర్లకు పదో తరగతిని విద్యార్హతగా నిర్దేశించడం దారుణమన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ ఆంక్షను తొలగించంతోపాటు వస్త్ర వ్యాపారులపై వ్యాట్ రద్దు, గీత కార్మికులు, ఆటోడ్త్రెవర్లకు వడ్డీలేని రుణాలు, పేదరిక నిర్మూలనకు అనేక పథకాలు తీసుకువస్తామన్నారు.

రాష్ట్ర ఉద్యోగుల జీతాలనూ కేంద్ర ఉద్యోగుల వేతన స్కేల్‌తో సమానం చేస్తామని హామీ ఇచ్చారు. వ్యాట్ ఎత్తివేయాలన్న వస్త్ర వ్యాపారులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని, ఆ పార్టీ నేతలకు ఇకముందు దుస్తులు విక్రయించవద్దని పిలుపునిచ్చారు.