March 20, 2013

అడిగితే ఆలోచిద్దాం

టీటీడీపీ ఎమ్మెల్యేల నిర్ణయం

హైదరాబాద్ : సడక్ బంద్‌కు మద్దతివ్వాలని తమను ఎవరైనా కోరితే అప్పుడు దాని గురించి ఆలోచించాలని టీడీపీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు నిర్ణయించారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో టీడీపీ జడ్చర్ల ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ఎదురుపడ్డారు. సడక్‌బంద్‌కు మద్దతు ఇవ్వచ్చు కదా అని ఈటెల జైపాల్‌ను అడిగారు. తమ పార్టీని టీఆర్ఎస్ గానీ, జేఏసీ గానీ ఇంతవరకు అడిగిన పాపాన పోలేదని, ఎవరూ అడగకుండా ఎలా ఇస్తామని జైపాల్ ప్రశ్నించారు. 'ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా' అని ఈటెల అన్నారు.

మా వాళ్లతో మాట్లాడి చెబుతానని జైపాల్ ఆయనకు చెప్పారు. తర్వాత జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో జైపాల్ ఈ సంభాషణను మిగిలిన ఎమ్మెల్యేలకు వివరించారు. 'ఎదురు పడినప్పుడు మాట వరసకు ఈటెల అడిగినంత మాత్రాన మనం ఎలా మద్దతిస్తాం? జేఏసీ నుంచో లేకపోతే బంద్ చేస్తున్న పార్టీల నుంచో ఒక లేఖ వచ్చినా స్పందించేవాళ్లం. ఎవరైనా అధికారికంగా కోరితే అప్పుడు ఆలోచిద్దాం' అని టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు బదులిచ్చారు. దానికి తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలంతా మద్దతిచ్చారు.