March 20, 2013

రేపటి నుంచి రాజమండ్రి చంద్రబాబు పాదయాత్ర

కాకినాడ : క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకునే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర బుధవారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో చంద్రబాబు రాజమండ్రి చేరుకుంటారు. నగరంలో పర్యటించి ఆ రోజు అక్కడే బస చేస్తారు. 21న రాజమండ్రి నుంచి బయలుదేరి కడియం వరకు నడవనున్నారు. 21వ తేదీ రాత్రి కడియంలో విశ్రాంతి తీసుకుంటారు.

కడియం నుంచి మండపేట, అక్కడి నుంచి అనపర్తి, కాకినాడ రూరల్, కాకినాడ నగరం పిఠాపురం, కత్తిపూడి మీదుగా తుని వరకు జిల్లాలో మొత్తం 13 రోజులపాటు చంద్రబాబు పాదయాత్ర చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మార్చి 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని తలపెట్టారు. ఆ రోజు చంద్రబాబు యాత్ర పిఠాపురం చేరుకుంటుంది. పార్టీ ఆవిర్భవించి 31 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో 31 అడుగుల పైలాన్‌ను నిర్మిస్తున్నారు. మార్చి 29న చంద్రబాబు ఈ పైలాన్‌ని ఆవిష్కరిస్తారు.

రైతులు, చేతివృత్తులు, కార్మికుల సమస్యలపై దృష్టి చంద్రబాబు పాదయాత్రలో ముఖ్యంగా రైతుల సమస్యలతో పాటు... చేనేత, గీత కార్మికులు, ఇతర చేతివృత్తుల వారి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. విద్యుత్ కోతలతో వందలాది పరిశ్రమలు మూలనపడి... వేలాది మంది కార్మికులకు పనిలేకుండా పోయింది. వీటిపైనా చంద్రబాబు దృష్టి సారించనున్నారు.

సంక్షేమ పథకాల అక్రమాలపైనా.. జిల్లాలో వృద్ధాప్య, వికలాంగుల, వితంతువుల పింఛన్ల పంపిణీ నుంచి డ్వాక్రా రుణాల మంజూరు, ఉపాధి హామీ అక్రమాలపైనా చంద్రబాబు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయనున్నారు. ఆయా వర్గాల ప్రజలతో మమేకమై.. వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించీ ఆరా తీయనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు జిల్లాలోనే బాబు పాదయాత్ర కొనసాగనుంది. రోజూ 15 కిలోమీటర్ల మేర నడిచేందుకు ప్లాన్ చేస్తున్నారు.