March 20, 2013

అప్పుడు వై.ఎస్, ఇప్పుడు కిరణ్ అందరూ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు

అవినీతి గురించి ప్రశ్నిస్తే నిందలా ?
జగన్‌పై మండిపడిన చంద్రబాబు
పశ్చిమ గోదావరి డిక్లరేషన్ ప్రకటన

ఏలూరు : అందరూ కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇప్పుడు కిరణ్ సర్కార్, అప్పుడు వై.ఎస్. ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆయన విరుచుకుపడ్డారు.

చంద్రబాబు నాయుడు తమ పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ ఇన్ని లక్ష ల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తే జగన్ వర్గీయులు తమపై బురద చల్లుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉందంటూ, సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా అందరికీ ఉంటుందని, కాని జగన్ పత్రిక మాత్రం తాము ఏదైనా అడిగితే తమను లక్ష్యం చేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నదని ఆయన అన్నారు.

ప.గో జిల్లా డిక్లరేషన్‌ను ప్రకటించిన చంద్రబాబు

వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం జిల్లా డిక్లరేషన్‌ను ప్రకటించారు. గోదావరి కాలువ ఆధునికీకరణ పనులు చేపడతామని తెలిపారు. ఏలూరు, భీమిలిలలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ రహదారి 214ని నాలుగు లైన్లుగా మారుస్తామని ఆయన తెలిపారు.

కొల్లేరును ఐదు కాంటూరు నుంచి మూడు కాంటూరు వరకు తగ్గిస్తామని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం నుంచి దవళేవశ్వరం వరకు గోదావరి వెంబడి మరో ప్రధాన కాలువ తవ్విస్తామని ఆయన వెల్లడించారు అసంఘటిత కార్మికుల కోసం ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. ధవళేశ్వరం ఆనకట్టుకు మరమ్మతులు చేపడతామని ఆయన తెలిపారు. జిల్లాలో చేపల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు.