March 20, 2013

వస్తున్నా మీకోసం


రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర బుధవారం రాజమండ్రి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంగళవారం విలేఖరులకు తెలిపారు. చంద్రబాబుకు సాయంత్రం 4.30 గంటలకు రోడ్ కం రైల్వే వంతెన మీద టీడీపీ జిల్లా నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలకనున్నారు. చంద్రబాబునాయుడు జిల్లాలోకి ప్రవేశించగానే రోడ్ కం రైల్వే వంతెన సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ నిర్వహిస్తారు.

డీలక్స్ సెంటర్‌లో ఎంబీసీ కులస్తులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి చాంబర్ ఆఫ్ కామర్స్ భవనానికి చేరుకుని వర్తకులతో మాట్లాడతారు. కోటగుమ్మం సెంటర్‌లో వస్త్ర వ్యాపారులతో మమేకమై వస్త్రాలను వ్యాట్ పరిధిలోకి తేవడంతో పాటు నిత్యావసర వస్తువుగా పరిగణించడం వల్ల వ్యాపారులకు ఎదురవుతున్న సమస్యల గురించి చర్చిస్తారు. వారి వాదన, బాధలను వింటారు. తర్వాత చర్చిపేట రైల్వే బ్రిడ్జి అప్సర «థియేటర్ రోడ్డులో మేదర కులస్తులతో ముఖాముఖి నిర్వహించి, చర్చిపేటలోని మాదిగల గృహాలను పరిశీలిస్తారు. జాంపేట అజాద్ చౌక్‌లో ముస్లిం మైనార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి దేవీచౌక్, నాగదేవి «థియేటర్ సెంటరు మీదుగా నటరాజ్ «థియేటర్ సెంటర్‌కు చేరుకుని అక్కడ అంబేద్కర్ హాలులో మాలలతో సమావేశం నిర్వహిస్తారు. మూలగొయ్యి ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీసీ వర్గాలు, ఇతర ప్రజల నుంచి వివిధ సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరిస్తారు. అక్కడి నుంచి సీతంపేట మీదగా లలితానగర్ చేరుకుని సీజీటీఎం కళాశాలలో రాత్రి బస చేస్తారు. తొలి రోజు మొత్తం 4.8 కిలోమీటర్ల మేర నడుస్తారు. పాదయాత్ర కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి నగరమంతా పసుపుమయం అయిపోయింది. విలేఖరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ, రాజమండ్రి నగర శాఖ అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.