March 20, 2013

విభేదాలు వీడండి..సమన్వయంతో పనిచేయండి: యనమల

తుని: 'ప్రస్తుతం కీలక సమయం.. సమీపంలోనే ఎన్నికలు.. అందరూ ఐక్యంగా ఉండి పార్టీని గెలిపించుకోవలసిన తరుణం ఆసన్నమయ్యింది.. విభేదాలు వీడండి.. సమన్వయంతో పని చేయండి.'' అని విశాఖ జిల్లా టీడీపీ నాయకులతో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం యనమలను కలుసుకునేందుకు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు దాడి రత్నాకర్, చింతకాయల రాంబాబు, విశాఖడెయిరీ పాలక మండలి సభ్యులు రెడ్డి రామకృష్ణ, కురందాసు నూకరాజు, బొల్లం బాబ్జి, పిర్ల రాంబాబు, విజయకుమార్ తదితరులు తుని విచ్చేశారు.

ఇటీవల బండారు సత్యనారాయణమూర్తి తదితరుల మధ్య విభేదాలు పొడచూపిన నేపథ్యంలో ఆయన పార్టీ శ్రేణుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని హితవు పలికారు. తదుపరి చంద్రబాబు వస్తున్నా మీకోసం.. పాదయాత్రపై చర్చించారు. ముందుగా అనుకున్నట్లు పాయకరావుపేట నియోజకవర్గం మీదుగా విశాఖ జిల్లాలో ప్రవేశించే పర్యటనను రద్దు చేయాలని నిర్ణయించారు.

తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మీదుగా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రవేశించేలా చంద్రబాబు పర్యటనను ఖరారు చేశారు. అందుకనుగుణంగా ఏర్పాట్లకు పూనుకున్నారు. ఈ సమవేశంలో యనమల కృష్ణుడు, యినుగంటి సత్యనారాయణ, మేకా రామ్మూర్తి (చిన్నా), గోపిశెట్టి ప్రసాదరావు, సూరంపూడి అప్పారావు, కూరపాటి రఘు, యనమల సతీష్ తదితరులు పాల్గొన్నారు.