March 26, 2013

లెఫ్ట్ శిబిరంపై పోలీస్ 'పవర్'.. నేతల అరెస్టు

'ఉద్యమ' విద్యుత్!
అంటుకున్న కరెంటు మంటలు
అసెంబ్లీ వాయిదా.. ఆందోళన ఉధృతం
ఉద్యమ బాటలో తెలుగుదేశం
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శిబిరం
చికిత్సకు నిరాకరణ, ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగింపు



అదే స్థలం... ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్! అదే అంశం... విద్యుత్ సమస్య! పుష్కర కాలం తర్వాత చరిత్ర పునరావృతమైంది! అప్పుడు... తెలుగుదేశం ప్రభుత్వంపై వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్, లెఫ్ట్ ఎమ్మెల్యేల దీక్ష! ఇప్పుడు... కాంగ్రెస్ సర్కారుపై లెఫ్ట్ దీక్షకు కొనసాగింపుగానా అన్నట్లు తెలుగుదేశం దీక్ష! రాష్ట్రంలో మరోమారు విద్యుత్ వేడి రగిలింది. దీక్షా భేరి మోగింది.

హైదరాబాద్ : కరెంటు చార్జీలు, కోతలపై వామపక్ష నేతలు చేస్తున్న దీక్షను మంగళవారం పోలీసులు భగ్నం చేసిన కొద్ది సేపటికే... ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు మెరుపు దీక్షకు దిగారు. తొలివిడత బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడగానే... ప్రధాన ప్రతిపక్ష సభ్యుల 'నిరవధిక దీక్ష' మొదలైంది. అసెంబ్లీ నుంచి నేరుగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పాదయాత్రగా వెళ్లి దీక్ష ప్రారంభించారు.

చార్జీల భారం తగ్గింపు, వ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్తు డిమాండ్లతో 25 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నిరవధిక నిరశనకు కూర్చున్నారు. దీంతో కొన్నాళ్లుగా రగులుతున్న 'విద్యుత్తు వేడి' మరింత రాజుకున్నట్లయింది. ఇది ఇప్పట్లో చల్లారే పరిస్థితి లేదని తేలిపోయింది. విద్యుత్తుపై శాసనసభలో సోమవారం మొదలైన చర్చకు మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ దీటుగా బదులిచ్చినప్పటికీ... విద్యుత్తు ఇబ్బందులు నిజమే అని అంగీకరించక తప్పలేదు. ఈ సంవత్సరం ఇంత కష్టాలు ఉంటాయని తాము ఊహించలేదన్నారు.

సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. చార్జీల భారం వాటిని భరించగలిగే వారిపైనే ఉంటుందని... సామాన్యులపై మాత్రం ఉండదని తెలిపారు. కిరణ్ నిర్దిష్టమైన హామీలు ఇవ్వలేదంటూ విపక్షాలు మండిపడ్డాయి. సీఎం సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. అంతకు ముందు మాట్లాడిన విపక్ష నేతలు ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న చార్జీలను ఉపసంహరించుకోవాలని, సర్‌చార్జీలను తొలగించాలని పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కనిపించలేదు. కిరణ్ దీనిపై స్పందించాలని వామపక్ష నేతలు కోరినప్పటికీ ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడటానికి ఇష్టపడలేదు.చివరికి... సభ నిరవధికంగా వాయిదా పడింది. సభలో పుట్టిన వేడి... బయటకు విస్తరించింది.

ఒక భగ్నం... ఒక ప్రారంభం: విద్యుత్ కోతలు, చార్జీలపై నిరశనకు దిగిన 'ఎరుపు' శిబిరంపై పోలీసులు మంగళవారం రాత్రి 7.35 గంటలకు మెరుపు దాడికి దిగారు. నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న రాఘవులు, నారాయణ సహా ఇతర వామపక్ష నేతలను అరెస్టు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. లెఫ్ట్ నేతలు ఆస్పత్రిలోనే తమ దీక్ష కొనసాగించాలని నిర్ణయించారు.

ఇలా ఇందిరా పార్కు వద్ద లెఫ్ట్ శిబిరాన్ని పోలీసులు ఖాళీ చేయించిన కాసేపటికే... ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద టీడీపీ శిబిరం మొదలైంది. ఈ సమస్యపై సర్కారు దిగి వచ్చేదాకా పోరాడతామని దీక్ష వేదికపై నుంచి టీడీపీ నేతలు ప్రకటించారు. ఇక... విద్యుత్ సమస్యపై ప్రభుత్వం సభలో సమాధానం చెప్పకుండా వాయిదా వేసుకొని పారిపోయిందంటూ వైసీపీ అసెంబ్లీ రెండో గేటు ముందు ధర్నాకు దిగారు. కాసేపటి తర్వాత వారిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు.