March 26, 2013

తెలుగుయువత నేత శ్రీహరిరాజు హఠాన్మరం


గాజువాక (విశాఖపట్నం): తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉత్తరాంధ్ర నందమూరి అభిమాన సంఘాల గౌరవాధ్యక్షుడు కొత్తపల్లి శ్రీహరిరాజు (41) గుండెపోటుతో మృతిచెందారు.ఆయన గుల్లలపాలెం మార్కెట్‌కు ఎదురుగా వున్న తన కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపటికి గుండెల్లో నొప్పి రావడంతో సన్నిహితులకు ఫోన్ చేసి కార్యాలయానికి త్వరగా రావాల్సిందిగా కోరారు. సన్నిహితులు వచ్చేసరికే కుర్చీలో కుప్పకూలిపోయి వున్నారు. ఆయన్ను హుటాహుటిన సమీపంలో వున్న సెయింట్ ఆన్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు «ద్రువీకరించారు.

బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌తో ఫోన్‌లో సంభాషణ... సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో సినీ నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో శ్రీహరిరాజు ఫోన్‌లో సంభాషించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఎప్పుడూ బైక్‌పై వెళ్లేవారని, అటువంటిది సోమవారం కాలినడకన వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం ఎనిమిదిన్నర వరకు ఫోన్‌లో తమతో మాట్లాడిన ఆయన 8.45 సమయానికి మృతి చెందినట్టు సమాచారం రావడంతో సన్నిహితులంతా దిగ్భ్రాంతి చెందారు.

సినీ డ్రిస్టిబ్యూటర్‌గా... శ్రీలక్ష్మి నరసింహ ఫిల్మ్ డ్రిస్టిబ్యూటర్ యజమానిగా వున్న కొత్తపల్లి శ్రీహరిరాజుకు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో సన్నిహిత సంబంధాలు వున్నాయి. విశాఖకు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన ప్రతిసారి శ్రీహరిరాజు వారి వెంటే వుండేవారు.

టీడీపీ నాయకులకు అండగా... పార్టీ ఆవిర్భావం సమయంలో శ్రీహరిరాజు తల్లి కొత్తపల్లి ప్రభావతి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి తల్లితో పాటు శ్రీహరిరాజు కూడా పార్టీలో తిరుగుతూ క్రియాశీలక పాత్ర పోషించారు. టీడీపీని పారిశ్రామిక ప్రాంతంలో బలోపేతం చేసేందుకు ఆయన ఎంతగానో కృషిచేశారు. మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి, టీడీపీ ఎమ్మెల్యేలతో సన్నిహితంగా వుంటూ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.

నిరుద్యోగ యువతకు అండగా... తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా, సినిమా డ్రిస్టిబ్యూటర్‌గా కాకుండా కాంట్రాక్టర్‌గా కూడా వ్యవహరిస్తూ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఎంతోమంది నిరుద్యోగ యువతకు శ్రీహరిరాజు అండగా నిలిచారు. ఆయన ముక్కుసూటిగా వ్యవహరించేవారని, ఆపదలో వున్న వ్యక్తులు సాయం కోరితే వెనుకాడకుండా వారికి అండగా నిలిచేవారని శ్రీహరిరాజు సన్నిహితులు స్పష్టం చేశారు.