March 26, 2013

చేతకాకుంటే దిగిపొండి: టీడీపీ

హైదరాబాద్ : సభను నడపడం చేతకాకపోతే దిగిపోవాలంటూ ప్రభుత్వంపై టీడీపీ మండిపడింది. రాష్ట్ర బడ్జెట్ తొలిదఫా సమావేశాల చివరిరోజైన మంగళవారం శాసనసభ విపక్షాల నిరసనలతో దద్దరిల్లింది. ప్రారంభమైన వెంటనే గంటపాటు వాయిదా పడింది. ఉదయం 9.02 గంటలకు సభ ప్రారంభమవగానే ప్రతిపక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మనోహర్ తిరస్కరించారు. దీంతో వైసీపీ, టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో.. సభ 10గంటలకు వాయిదాపడింది.

మరో 55 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత రెవెన్యూ సదస్సుల గురించి మాట్లాడేందుకు మంత్రి రఘువీరాకు స్పీకర్ అనుమతిచ్చారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియం వద్దకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. రఘువీరా కలుగజేసుకొని తనకు అవకాశమివ్వాలని, త్వరగా ముగిస్తానని కోరడంతో టీడీపీ సభ్యులు శాంతించారు. "శాసనసభ సమావేశాల తీరు బాధ కలిగిస్తోంది. పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్‌ల వైఖరి వల్లే ప్రజాసమస్యలు చర్చకు రాకుండా పోయాయి'' అని టీడీపీ సభ్యుడు దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు