March 26, 2013

సమస్యలు పరిష్కరించాలని టీడీపీ ధర్నా

రేపల్లె : పట్టణంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి, ధర్నా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలు తీరుస్తామంటూ గద్దెనెక్కిన నాయకులు ఒకరు జైల్లో వుంటే.. ఎంపీ నేమో ఢిల్లీలోనే చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు.

రేపల్లె, మృత్యుంజయపాలెం, నిజాంపట్నం, అల్లపర్రు, అడవులదీవిలలో ఏ వాటర్ స్కీమ్ కూడా ఒక్క పూట నీరు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రేపల్లెలో పైలెట్ వాటర్ స్కీమ్‌కు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేసినా ప్రజలకు సమృద్ధిగా నీరు అందించటంలో విఫలం చెందారన్నారు. ఓ పక్క విద్యుత్ కోతతతో సతమత మవుతుంటే, డ్రెయినేజ్‌లో మురుగు పేరుకుపోయి నీరు పారక దోమలతో సతమతమవుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

మురికివాడల్లో ఫాగింగ్ చేయడం, బ్లీచింగ్ చల్లటం లేదని, దీనివల్ల ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారన్నారు. కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పాలకులు, అధికారులు గొప్పలు చెప్పటమే తప్ప పట్టణంలో సమృద్ధిగా నీరు అందించటంలో విఫలం చెందారని ఆయన అన్నారు. ఇప్పటికైనా పురపాలక సంఘంలోని అధికారులు ప్రజలకు నీరు అందించి మురుగునీరు, విద్యుత్ దీపాల సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. తొలుత పట్టణంలో వార్డుల్లోని సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించారు. అనంతరం కమిషనర్‌కు వినతిప్రతం అందజేశారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీపీ రామారావు, దాసరి నాగరాజు, జీవీ నాగేశ్వరరావు, కె.రమాశాంతాదేవి, కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు,ఎన్‌వీకే ప్రసాద్, లోకం మోషే, డొక్కు వీరయ్య, పంతాని మురళీధరరావు, మెండు సుబ్బారావు, మేకా రామకృష్ణ, గుర్రం మురహరిరావు, ఆలూరి డానియేల్, శ్యామ్, మోర్ల అంజయ్య, కారుమూరు బసవరావు, షేక్ ఖాదర్ బాషా, బి.రాజకిషోర్, షేక్ మొబిన్, అంకాలు, మోర్ల అరుణ, దున్నా జయప్రద తదితరులు పాల్గొన్నారు.