March 26, 2013

పేదల సొమ్ము తిన్నారు పెరిగిన ఆదాయాన్ని దోచేశారు లేదంటే రాష్ట్రం దశ మారేది

శ్రమజీవుల శత్రువులు వాళ్లు!
వైఎస్ నుంచి కిరణ్ దాకా దోపిడీదార్లే
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు ధ్వజం
ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం కడతామని హామీ

కాకినాడ : నాటి వైఎస్ నుంచి నేటి కిరణ్‌కుమార్ రెడ్డి దాకా.. కాంగ్రెస్ సీఎంలంతా శ్రమజీవుల శత్రువులేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. అధికారంలోకి వస్తే, ప్రతి నియోజకవర్గంలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటుచేయిస్తానని భరోసా ఇచ్చారు. అలాగే వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.600కు పెంచుతామన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కుతుకులూరు జంక్షన్ వద్ద మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు. పెడపర్తి, కుతుకులూరు, రామవరం, మహేంద్రవాడ, రాయవరం వరకు 12.1 కిలోమీటర్ల మేర నడిచారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో వైఎస్ కుటుంబం అక్రమాలపై విరుచుకుపడ్డారు.

"రాష్ట్రంలో ఆదాయం పెరిగింది. అది పేదలకు చేరితే రాష్ట్రం మరోలా ఉండేది. కానీ దాన్నంతా వైఎస్ కుటుంబం, కొంతమంది కాంగ్రెస్ నాయకులు దోచుకున్నా''రని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ కుల,మత, రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమయిందని చెప్పారు. టీడీపీ అందించిన పారదర్శక పాలనను, అవినీతిమయ, అసమర్థ కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలని కోరారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తే..కాంగ్రెస్ దొంగలు విద్యుత్ లేకుండా చేశారని విమర్శించారు. వైఎస్ నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి దాకా.. కాంగ్రెస్ ముఖ్యమంత్రులంతా దోపిడీదార్లేనని, వారంతా శ్రమజీవుల శత్రువులని దుయ్యబట్టారు.

"నేను ఎవరి మీదో వ్యక్తిగత వైరంతో చెప్పడం లేదు. ఈ తొమ్మిదేళ్లలో జరిగిన దోపిడీ పాలనకు భవిష్యత్తులోనూ మనమంతా మూల్యం చెల్లించుకోక తప్పదు. పెరిగిన ఆదాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరితే, ఈ ప్రభుత్వం మాత్రం పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేసి దోమలను అభివృద్ధి చేస్తు''న్నదని ఎద్దేవా చేశారు. 7.50 లక్షల మంది బిఎడ్ నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన 'ఎస్.జి.టి' అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తనను కలిసిన కొందరు బీఎడ్ అభ్యర్థులకు ఆయన ధైర్యం చెప్పారు. అగ్రవర్ణాలలోని పేదలకు రిజర్వేషన్ కల్పించి ఆదుకుంటామని, కాపులకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు.. అనపర్తి మండలం పెడపర్తిలో ముమ్మిడివరం నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. "ప్రభుత్వ వైఫల్యాలు, పిల్ల కాంగ్రెస్ (వైసీపీ) అక్రమాలను సమర్థంగా ప్రజల వద్దకు తీసుకెళితే మనదే అధికారం'' అంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కాంగ్రెస్‌లో కొంతమందికే పదవులు వస్తే టీడీపీలో అందరికీ న్యాయం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలని కోరారు. ఆ ఎన్నికలలో విజయం సాధిస్తే యోగ క్షేమాలు సహా ప్రతి బాధ్యతా తీసుకుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. విద్యుత్ సమస్యపై ఉద్యమిస్తున్న లెఫ్ట్ నేతల అరెస్టును ఆయన ఖండించారు.