March 26, 2013

ఉగాది నుంచి బాబు యాత్ర

(విశాఖపట్నం): మీ కోసం వస్తున్న పాదయాత్రకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉగాది రోజున విశాఖ జిల్లాకు రానున్నారు. ముందుగా ప్రకటించిన తేదీలల్లో స్వల్పమార్పులు చేశారు. వచ్చే నెల పదిన కొత్త అమావాస్య కావడంతో మరుసటి రోజు నుంచి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అయితే చంద్రబాబు పాదయాత్ర ముగింపుమాత్రం వచ్చేనెల 27న వుంటుంది. అందువల్ల ఆదివారాలు కూడా అధినేత పాదయాత్ర వుంటుందని పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ తెలిపారు. తాజాగా సవరించిన షెడ్యూల్ మేరకు వచ్చే నెల తొమ్మిదిన తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చేరుకుని అక్కడే బసచేస్తారు.

పదిన కొత్త అమావాస్య కావడంతో విశాఖ జిల్లాలో నూకాంబిక పండుగ జరుపుకుంటారు. దీంతో ఆ రోజు చంద్రబాబు కోటనందూరులోనే వుంటారు. పదకొండు ఉగాదిన ఉదయం పంచాంగం శ్రవణం, ఉగాది వేడుకలు నిర్వహించిన అనంతరం అదే రోజు సాయంత్రం విశాఖ జిల్లా గన్నవరం మెట్టలోనికి అడుగిడతారు. అక్కడ నుంచి 27 వరకు ఇప్పటికే ఖరారుచేసిన రూటు మేరకు పాదయాత్ర వుంటుందని రత్నాకర్ తెలిపారు. రూటులో ఆదివారాలు కూడా నడుస్తారని తెలిపారు. వచ్చేనెల 27న కచ్చితంగా ముగింపుసభ వుంటుందని వివరించారు. ముగింపుసభ వేదిక ఖరారుపై ఒకటి రెండురోజుల్లో ఖరారుచేస్తామని తెలిపారు.