March 22, 2013

వైఎస్ అవినీతిలో కేవీపీకి భాగం:టీడీపీ

హైదరాబాద్ : వైఎస్ హయాంలోని అవినీతి, అక్రమార్జన కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీపీ రామచంద్రరావును కూడా సీబీఐ అరెస్టు చేసి విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని టీడీఎల్పీలో ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత ముద్దు కృష్ణమ నాయుడు విలేకరులతో మాట్లాడారు. 2004 నుంచి 2009 వరకూ రాష్ట్రంలో జరిగిన అవినీతి వ్యవహారాలన్నీ కేవీపీ చేతుల మీదుగానే జరిగాయని, వీటన్నింటిలో ప్రమేయం ఉన్న ఆయనను సీబీఐ వదిలిపెట్టడానికి వీల్లేదని అన్నారు.

'దుబాయిలో కేవీపీకి షాపింగ్ మాల్స్, నివాస అపార్టుమెంట్లు ఉన్నాయి. దుబాయిలో పెట్రోలు బావులు కొనాలని ఒక షేక్‌కు రూ. 450 కోట్లు ఇచ్చి మోసపోయాడు. వాటిని రాబట్టుకోవడానికి పెద్ద పోరాటం చేసినా ఫలించలేదు. ఆయనకు ఇన్ని కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో సీబీఐ విచారించాలి' అని ముద్దు కోరారు.

గతంలో కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉండటంతో ఆయన అవినీతిపై కొంత ఉపేక్ష వహించారని, ఇటీవల జగన్‌తో లోపాయికారీ సంబంధాలు పెట్టుకోవడంతో సీబీఐ రంగంలోకి దిగిందని గాలి వ్యాఖ్యానించారు. 'తన దగ్గరి బంధువు పార్థసారథిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేయడం ద్వారా ఏపీఐఐసీని తన జేబు సంస్థగా మార్చుకొన్నారు.' అని ముద్దు ఆరోపించారు.