March 22, 2013

అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్యేల తరలింపు

అసెంబ్లీలో విద్యుత్ సౌకర్యం నిలిపివేత
వ్యాన్లలో ఎన్టీఆర్ ట్రస్టుకు తరలించిన పోలీసులు
అక్కడ నుంచే దీక్షలు చేపడతామన్న ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ జరపాలని టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో విద్యుత్ ఛార్జీల పెంపుదల విషయంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం సభను వాయిదా వేయడంతో టీడీపీ సభ్యులు అసెంబ్లీలోనే దీక్షలు చేపట్టారు. దాదాపు 56 మంది టీడీపీకి చెందిన శాసనసభ్యులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి దీక్షలో ఉండటంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మధ్యాహ్నం నుంచే పోలీసులు అసెంబ్లీ ఆవరణలో మోహరించారు. ఏ క్షణంలోనైనా పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తారని సూచనలు కనిపించాయి. రాత్రి 11.30 గంటల సమయంలో పోలీసులు అసెంబ్లీలోకి ప్రవేశించి అన్నీ గేట్లను మూసివేసి ఒక్క గేట్‌ను మాత్రమే తెరిచి ఉంచారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి పోలీసులు టీడీపీ సభ్యులను ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు తరలించారు.

దీక్షలో పాల్గొన్న సుమారు 56 మంది టీడీపీ సభ్యులను అర్ధరాత్రి సమయంలో వ్యాన్లలో తరలించారు. చంద్రబాబు ఎప్పటికప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలకు సూచనలు అందజేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలిస్తారనే విషయం వారికే అర్థం కాలేదు. రెండు బస్సులు, పలు కార్లలో వారిని తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియాతో ఫోన్‌లో మాట్లాడుతూ విద్యుత్ సమస్యలపై పోరాటం చేస్తున్న తమను ప్రభుత్వం అమానుషంగా అరెస్టు చేసిందని విమర్శించారు.

ఎక్కడికి తరలంచినా తాము అక్కడే దీక్ష చేపడతామని, అక్కడి నుంచే శనివారం అసెంబ్లీకి వెళ్లతామన్నారు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అవలంభించాల్సిన వైఖరిపై చంద్రబాబు తగు సూచనలు చేశారని సమాచారం. శనివారం అసెంబ్లీలో బ్లాక్ పేపర్‌ను ప్రవేశపెట్టాలని సూచించినట్లు తెలిసింది. తాము ఏమి చేస్తే బాగుంటుందని ప్రజల నుంచి సలహాలను సేకరించాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఫోన్ల ద్వారా సూచించినట్లు సమాచారం.