March 22, 2013

7న జిల్లాకు బాలకృష్ణ రాక


 విజయవాడ:నందమూరి బాలకృష్ణ కృష్ణా జిల్లాలో ఏప్రిల్ ఏడవ తేదీన పర్యటించబోతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఆయన పర్యటన సాగనుంది. నియోజకవర్గం పరిధిలోని విస్సన్నపేట, గంపలగూడెం మండలాల పరిధిలో మొత్తం ఆరుగ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొంటారు. బాలకృష్ణ మార్చి 30, 31 తేదీలలో జిల్లాకు రావాల్సి ఉంది. ఎన్టీఆర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ సెమినార్ ఉండటం, ముగింపు కార్య క్రమం కూడా అప్పుడే ఉండటంతో శుక్రవారం రాత్రి పర్యటన వాయిదా పడింది.

ఏప్రిల్ 7వ తేదీన జిల్లాకు రానన్నట్టు బాలయ్య హామీ ఇచ్చారు. బాలకృష్ణ పర్యటన షెడ్యూల్ వాయిదా పడటంతో విగ్రహావిష్కరణల కార్యక్రమాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించటానికి నియోజకవర్గ టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించటానికి కారణాలేమీ లేవు. వస్తున్నా .. మీకోసం పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుగా ఖమ్మం జిల్లా నుంచి సత్తుపల్లి మీదుగా తిరువూరు నియోజకవర్గంలో అడుగు పెట్టాల్సి ఉంది.

ఆ తర్వాత షెడ్యూల్ మారింది. నల్గొండ జిల్లా నుంచి కోదాడ మీదుగా కృష్ణాజిల్లాలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. సత్తుపల్లి మీదుగా చంద్రబాబు వస్తున్నాడన్న ఉద్దేశ్యంతో తిరువూరు నియోజకవర్గ పార్టీ భారీ ఎత్తున బాబుతో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలు చేయించాలని ఏర్పాట్లుచేసింది. అయితే.. బాబు రూట్ మారటంతో సీన్ మారిపోయింది. ఈక్రమంలో ఇటీవల రెండో విడతగా జిల్లా పాద యాత్రకు బాబు వచ్చినప్పుడు తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు ఆయనతో తమ నియోజకవర్గంలో చేసుకున్న ఏర్పాట్లు గురించి వివరించారు. కనీసం రెండు విగ్రహావిష్కరణలలో అయినా తాను తర్వాత పాల్గొంటానని చెప్పినట్టు తెలిసింది. ఇదే సందర్భంలో చంద్రబాబు తన వియ్యకుండు బాలకృష్ణకు ఫోన్ చేసి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరటంతో ఆయన అంగీకరించారు. తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వాయిదా పడిన వివరాలతో పాటు, బాలకృష్ణ ఎప్పుడు వస్తున్నదీ వివరించారు. ఏప్రిల్ ఏడవ తేదీన ఒక్క రోజే బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ముందుగా విస్సన్నపేట మండలం పరిధిలోని కలగర గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరిస్తారు. ఆతర్వాత గంపలగూడెం మండలంలోని అనుమల్లంక, కొమెర, మేడూరు, సత్యాలపాడు, పెనుగొలనులలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణల్లో పాల్గొంటారు.

పెనుగొలనులో బహిరంగసభలో బాలయ్య పాల్గొంటారు. అనంతరం నియోజవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు స్వామిదాసు ఆంధ్రజ్యోతికి చెప్పారు.