March 22, 2013

'కోత'ల కారకుడు వైఎస్సే!

సర్ చార్జీల పాపం ఆయనదే
అదే దారిలో కిరణ్
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు ధ్వజం

  కాకినాడ : వైఎస్ సీఎంగా ఉండగా ఎక్కువ రేటుకు ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన పాపం ఇపుడు పేద, మధ్యతరగతి ప్రజల్ని సర్‌చార్జీల రూపంలో వెంటాడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కొమ్మూరు వద్ద ఆయన శుక్రవారం పాదయాత్ర ఆరంభించారు. ధవళేశ్వరం, ఎర్రగుండ పప్పువారి సెంటర్, కాటన్‌దొర బ్రిడ్జి, వేమగిరి ఎస్సీపేట, కడియం దాకా నడిచారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్న విద్యుత్ సమస్యపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. "1994లో సంస్కరణలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేశాను.

ఇప్పుడీ కాంగ్రెస్ దొంగలు వచ్చి రాష్ట్రాన్ని చీకటి రాజ్యంగా మార్చేశారు. సర్‌చార్జీలరూపంలో పేద, మ ధ్యతరగతి ప్రజలపై వేల కోట్ల రూపాయలు భారం పడుతోంది'' అని పేర్కొన్నారు. కరెంటు లేకపోయినా ఈ చార్జీలేమిటని ఘాటుగా ప్రశ్నించారు. "మీరొస్తే కానీ ఈ కరెంటు కష్టాలు తీరి, మాకు ఉపాధి దొరకదు సార్!'' అని ఓ యువకుడు అనగా, "తమ్ముడూ! ఈసారి మనమే అధికారంలోకి వస్తాం'' అని ధీమాగా పలికారు.

"ప్రైవేటు కంపెనీల నుంచి వైఎస్ ముడుపులు తీసుకొని.. యూనిట్ రూ. 14కి కొనుగోలు చేశారు. విద్యుత్ రంగాన్ని అతలాకుతలం చేశారు. అదే వరసలో ఇప్పుడు కిరణ్ కూడా ప్లాంట్ల నుంచి ముడుపులు అందుకుని కరెంటు కష్టాలు తెచ్చార''ని దుయ్యబట్టారు. కాగా, పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న ఆయన.. ఇప్పటి వరకు చెల్లించిన వడ్డీనీ తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీ కూడా చేస్తామన్నారు.

షెడ్యూల్‌లో స్వల్ప మార్పు: చంద్రబాబు రోజువారీ నడకలో స్వల్ప మార్పులు చేశారు. వీలైనంత త్వరగా గమ్యాన్ని చేరేందుకు ఆయన రోజుకు 12 నుంచి 16 కిలోమీటర్ల మేర నడిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. రాబోయే వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా చంద్రబాబు పాదయాత్రలో స్వల్ప మార్పులు చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఇకపై ఆయన 10 కిలోమీటర్ల లోపే పాదయాత్ర చేయరని వారు చెబుతున్నారు.

దీనివల్ల తూర్పుగోదావరి జిల్లాల్లో ఆయన యాత్ర అదనంగా మూడు రోజులు ( 16) సాగనుంది. మరోవైపు, అర్ధరాత్రి దాటినా పాదయాత్రలో జనం రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. విద్యుత్ కోతల సమస్యను ఎక్కువగా ఆయన దృష్టికి తీసుకువస్తున్నారు. ఇదిలాఉండగా, సమీక్షల్లోనూ చంద్రబాబు కొత్త పుంతలు తొక్కు తున్నారు. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఒకటి, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.