March 11, 2013

కాంగ్రెస్‌తో కలయికే విజయ రహస్యం

ఇదే జగన్ పార్టీ రంగు!
అదేమాట చెప్పిన విజయలక్ష్మి
2014 తరువాత విలీనమేనట
పశ్చిమ యాత్రలో చంద్రబాబు ధ్వజం

ఏలూరు : " వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనున్నాం. 2014 తర్వాత కాంగ్రెస్‌లోనే కలుస్తా'మని స్పష్టం చేశారు. ఆ పార్టీ విజయ రహస్యం ఏమిటన్నది ఇప్పుడు బయటపడింది'' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీని కాంగ్రెస్ లో విలీనంచేసే దిశగా ఎత్తుగడలు ప్రారంభమయ్యాయని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతం పెద అమిరం గ్రామంలో సోమవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. భీమవరం క్రాస్‌రోడ్స్, విస్సాకోడేరు, గొరగనమూడి, పాలకోడేరు మార్కెట్‌యార్డ్ వరకు నడిచారు. అంతకుముందు చింతలపూడి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడినప్పుడు, భీమవరంలో జరిగిన సభలోనూ విజయలక్ష్మి ఇంటర్వ్యూ సారాంశాన్ని చంద్రబాబు.. ప్రజలకు వివరించారు.

'నేను మొదటి నుంచి తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండూ విలీనం కాక తప్పదని చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు ఆ రెండు పార్టీలూ ఒకే గూటికి చేరుకోవడం ఖాయమ''ని జోస్యం చెప్పారు. '2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు సహకరిస్తాం' అనే ఆమె మాటల్లో అంతరార్థం ఏమిటనేది గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "జగన్‌ను కేసుల నుంచి బయటపడేసేందుకు తొలినుంచీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు అదే విషయం రట్టయింది'' అని విమర్శించారు.

పార్టీలను కలిపేసుకోవడానికి కాంగ్రెస్ ఎత్తుగడలు వేయడం కొత్తేమీ కాదని, బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ నుంచి చిరంజీవి పార్టీ వరకు.. ఇదే కథ కొనసాగిందని గుర్తుచేశారు. పాదయాత్రలో భాగంగా ఆయన ఎస్ఆర్‌కే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను కలుసుకున్నారు. "సార్.. లోకేశ్‌కి తెలుగు యువత విభాగం బాధ్యతలు ఎందుకు అప్పగించరు?'' అంటూ విద్యార్థులు ప్రశ్నించగా, నవ్వి ఊరుకున్నారు. మార్గమధ్యంలో చిన్నాచితకా వ్యాపారులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

భీమవరం ప్రకాశం చౌక్‌లో జరిగిన బహిరంగసభలో విద్యార్థులు, మహిళలు, ఆక్వా రైతులు, వ్యాపారులు, బాధితులకు మైక్ ఇచ్చి మాట్లాడించారు. అంతకుముందు చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాల పరిస్థితిపై కార్యకర్తలతో సమావేశమయ్యారు. "ఆశలు ఉండొచ్చుగానీ పార్టీపరంగా అందరూ ఎన్నికలకు సమాయత్తం కావాలి. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామ''ంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలనే అభ్యర్థులుగా ప్రకటిస్తామని, ఎక్కడైనా ప్రజా వ్యతిరేకత వస్తే కొత్తవారికి అవకాశం ఇస్తామని చెప్పుకొచ్చారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, పశ్చిమగోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలన్న కార్యకర్తల డిమాండ్‌ను ఆయన ఆమోదించారు.