March 11, 2013

బాబ్లీ పాపం తప్పించుకోవడానికే టీఆర్ఎస్ విమర్శలు

సిరిసిల్ల టౌన్ : మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు పాపం నుంచి టీఆర్ఎస్ తప్పించుకోవడానికే టీడీపీపై విమర్శ లు చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డబోయిన గోపి అన్నారు. టీడీపీ పట్టణ కార్యాలయంలో ఆదివా రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే బాబ్లీ ప్రాజెక్టుకు అనుమతి వచ్చిందని, ప్రాజెక్టు నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులివ్వమని కేం ద్ర ప్రభుత్వమే అనుమతి ఇస్తుందన్న విషయాన్ని ఎమ్మెల్యేకేటీఆర్ గుర్తెరుగాలన్నారు.

2001మే నుంచి టీడీపీ ఉద్యమిస్తుందని ఉత్తర తెలంగాణలోని 19 లక్షల ఎకరాల సాగు భూమి ఎడారిగా మారుతుందని పార్లమెంట్ ,అసెంబ్లీలో టీడీపీ ప్రాస్థావించిందన్నారు. 2007 లో బాబ్లీని సందర్శించడానికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర ప్రభు త్వం లాఠీచార్జి చేయించి జైల్లో పెట్టార న్నారు. విపక్షాలతో కలిసి 22మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట ఆ తరువాత ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందన్నారు. బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి చం ద్రబాబు, ఎమ్మెల్యేలను మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్‌లో అరెస్ట్ చేసిందని తెలిపారు. ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే డ్రామా చేసిందని టీఆర్ఎస్ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పెంచుకోవడమే తప్ప ప్రజా సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు.

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై కంటి తుడుపుగా టీఆర్ఎస్ కోర్టులో కేసు వేసి వదిలేసిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు చిటికెన కనుకయ్య, కార్యదర్శి భీమవరపు మనోహర్, జిల్లా కార్యదర్శి ఏనుగుల ఎల్లయ్య, లెంకల లక్ష్మారెడ్డి, కామినేని రవీందర్, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు గుండ్లపెల్లి పూర్ణచందర్, ఉపాధ్యక్షుడు వంగరి గోపి తదితరులు పాల్గొన్నారు.