March 11, 2013

'కీర్తి'ని పెంచే యువతరమిది!

"సార్! కట్నం కోసం ప్రాణాలు తీస్తారా?. ఇదేం ఆటవికం''.. ఈ ప్రశ్న రోజంతా నన్ను వెంటాడింది. అప్పటికి ఏమి సమాధానం చెప్పినా.. తీవ్రంగా ఆలోచింపజేసింది. నేనే కాదు, యావత్ సమాజమూ ఆలోచించాల్సిన ప్రశ్న ఇదనిపిస్తోంది. అడిగింది ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని కావడం వల్ల కూడా ఈ ప్రశ్న బాగా కదిలించేసింది. చదువుకొనే అమ్మాయిలూ అభద్రత అనుభవిస్తున్న సమాజం ఇది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఆడపడుచులకు అభయహస్తం లభించకపోవడం నిజంగానే సిగ్గుచేటైన విషయం.

ఇది కేవలం ఓ విద్యార్థిని సమస్య కాదు.. మొత్తం సమాజమే జాగృతమై ముక్తకంఠంతో బదులివ్వాల్సిన ప్రశ్న ఇది. భీమవరంలోని ప్రైవేట్ కాలేజీ విద్యార్థులను కలిసినప్పుడు 'నిర్భయ' నుంచి అవినీతి దాకా.. వాళ్లు వేసిన ప్రశ్నలు నన్ను ఉత్సాహపరిచాయి. వట్టి మాటలు కట్టిపెట్టి.. గట్టి మేల్ చేయడానికి యత్నించి ఎదురుదెబ్బలు తిన్న కథలెన్నో వినిపించారు. లంచం పెట్టనందుకు కొన్నేళ్లుగా మండల ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదన్న ఆ అమ్మాయి ఆవేదన, పట్టుదల ముచ్చటేశాయి. పేరుకు తగినట్టే యువత 'కీర్తి'ని పెంచే ఇలాంటి ఆడబిడ్డలే కావాలిప్పుడు!

కూలీలు, హమాలీలు, మెకానిక్కులు, దర్జీలు.. భీమవరం క్రాస్ వైపుగా పోతున్నప్పుడు కలిసిన వీరంతా వినిపించిన కథలన్నీ ఒక్కటేననిపించింది. పైగా.. వాళ్ల సమస్యలన్నీ పరస్పరం ముడిపడినవి కూడా. చేతి నిండా పని దొరికితేనే కూలీలు, హమాలీలు కోలుకుంటారు. వాళ్ల చేతుల్లో డబ్బులు ఆడితేనే, అదీఇదీ కొనగలుగుతారు. అప్పుడే మెకానిక్ చేతుల్లో సుత్తికి, దర్జీల కత్తెరకు పని పడుతుంది. ఇప్పటికే పొలమారిన ఈ బతుకులకు పన్నులు, సర్‌చార్జీలంటూ మరింత పొగబెట్టడం ఎంత దారుణం!