March 24, 2013

వైఎస్.. ఓ ధృతరాష్ట్రుడు.. ఆయన కొడుకు.. ఓ దుర్యోధనుడు

'ఆత్మ'ను విచారిస్తే అక్రమాలన్నీ బయటకు..!
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు..

కాకినాడ : "మహాభారతంలో ధృతరాష్ట్రుడిలా.. వైఎస్ ఈ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతారు. ధృతరాష్ట్రుడు తన కొడుకు దుర్యోధనుడితో తప్పులు చేయించినట్లు వైఎస్ కూడా జగన్‌తో అనేక అక్రమాలు చేయించాడు. అధర్మంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు. వారి దోపిడీకి రాష్ట్రంలో పేదలకు దక్కాల్సిన నిధులు ఆవిరైపోయాయి. కానీ మహాభారతంలో చివరికి ధర్మమే గెలిచింది. వైఎస్, కాంగ్రెస్ అక్రమాలపై ఇప్పుడు మా పార్టీ అలాంటి ధర్మపోరాటమే చేస్తోంది. ఈ పోరాటానికి మీరంతా సహకరించాలి. మనం తప్పకుండా గెలుస్తాం.'' అని టీడీపీ అధినేత చంద్ర బాబు అన్నారు.

వైఎస్ 'ఆత్మ' (కేవీపీ రామచంద్రరావు)ని విచారిస్తే అక్రమాలన్నీ బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. వీరవరం, పొట్టిలంక, గుళ్ల మీదుగా నడిచారు. ఈ సందర్భంగా కడియంలో జరిగిన సభలో ప్రజలు ఉత్సాహంగా చంద్రబాబుకు తమ వినతులు చెప్పుకొచ్చారు. "మీరు రాగానే బ్రాందీ ఎత్తేయించండి సార్!'' అని ఓ మహిళ విజ్ఞప్తి చేయగా, "రాష్ట్రంలో వైఎస్ కుటుంబం ఒక్కటి తప్ప అందరం కష్టాల్లోనేఉన్నా''మని ఓయువకుడు ఆవేదక వ్యక్తం చేశారు. వారిని చంద్రబాబు అనునయించారు.

జగన్ అక్రమాస్తుల కేసులో ఎంపీ కేపీవీని సీబీఐ ప్రశ్నించిన ఉదంతాన్ని పాదయాత్రలో ప్రముఖంగా ప్రస్తావించారు. "వైఎస్ 'ఆత్మ' సీబీఐ ఎంక్వయిరీకి వెళ్లింది. పరలోకంలో ఉన్న 'ఆత్మ' చేసిన అక్రమాలు, ఆయన కొడుకు చేసిన అక్రమాలు ఈ విచారణలో బయటకు రావాలి'' అని పేర్కొన్నారు. రాజకీయాలకు వైఎస్ కుటుంబం కళంకం తెచ్చిందని మండిపడ్డారు. "మతం ముసుగులో వైఎస్ అల్లుడు అక్రమాలకు పాల్పడుతున్నారు. విజయలక్ష్మి తమ్ముడు ఎరువుల్లో మట్టి కల్తీచేసి అమ్ముతున్నాడు. రాజకీయాలలో ఇన్ని దారుణాలకు ఏ కుటుంబమూ పాల్పడలేద''ని విమర్శించారు.

పోలవరం పేరుతో సమాంతర కాల్వలు తవ్వి వేల కోట్ల రూపాయలు దోచుకున్న ఘనత వైఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలదేనని దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలూ, ప్రజలూ నిర్లక్ష్యం, నిర్లిప్తత విడనాడి కాంగ్రెస్ అక్రమాలతో జరుగుతున్న నష్టాలను అందరికీ వివరించాలని పిలుపునిచ్చారు. కాగా, పాదయాత్రకు ఆదివారం చంద్రబాబు విరామం ఇవ్వనున్నారు. భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్ శనివారం పాదయాత్రలో ఉన్న చంద్రబాబును కలిశారు. ఆదివారం మండపేట మండలం ఏడి ద గ్రామంలోని క్యాంప్‌లో వారు బస చేయనున్నారు. రోజంతా ఆయన వారితోనే గడుపుతారు.