March 23, 2013

మేమూ వస్తున్నాం మీ పాదయాత్రకు

కాకినాడ:క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుని సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తోంది. మూడు రోజులుగా నిర్వహిస్తున్న 'వస్తున్నా మీ కోసం' యాత్రలో చంద్రబాబు వెంట వేలాదిమంది కార్యకర్తలు, జనం పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ తమ గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. బీటెక్ చదివినా ఉద్యోగం లేదని ఒక యువకుడు చెప్తే.. వికలాంగులకు కాంగ్రెస్ పాలనలో అన్యాయం జరిగిందని మరో యువకుడు బాబుకు విన్నవిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్నా కరెంటు కోతలు తప్పడంలేదంటూ ఒక మహిళ చెప్తే.. పావలా వడ్డీ అన్నారు..ఇపుడు ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇదేం అన్యాయం అంటూ మరో మహిళ తన వేదన చెప్పుకొచ్చారు.

వస్తున్నా మీ కోసం యాత్రలో భాగంగా మూడో రోజు రాజమండ్రిరూరల్ మండలం హుకుంపేటలో మధ్యా హ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు కార్యకర్తలు తమ సూచనలను బాబు దృష్టికి తీసుకువచ్చారు. అర్ధరాత్రి దాటినా జనం చంద్రబాబు అడుగులో అడుగువేస్తూ కదలి వస్తున్నారు. హుకుంపేట, బొ మ్మూరు, ఎర్రకొండ, ధవళేశ్వరం, వేమగిరి తదితర ప్రాంతాలలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాం గ్రెస్ దొంగల వల్ల రాష్ట్రం అధోగతి పాలయిందన్నారు. లక్ష కోట్లు దోచుకున్న జగన్ జైల్లో ఉన్నాడన్నారు. ఐఏఎస్‌లనూ జైలుకు పంపిన ఘనత వైఎస్‌దేనన్నారు.

సర్‌ఛార్జి కాదు.. అవినీతి ఛార్జి వైఎస్ సీఎంగా ఉన్నపుడు అనేక ప్రయివేటు విద్యుత్ కంపెనీల నుంచి భారీగా ముడుపులు తీసుకుని అత్యధిక ధరకు (యూనిట్ రూ.14) కొనుగోలు చేయడం వల్లే ఇపు డు సర్‌ఛార్జి బారం ప్రజలపై పడుతుందని చంద్రబాబు బొమ్మూరు సెంటర్‌లో వ్యాఖ్యానించారు. 'ఇది సర్‌ఛార్జి కాదు. వైఎస్., కిరణ్ కుమార్‌రెడ్డి అవినీతి ఛార్జి' అంటూ ఎద్దేవా చేశారు. కరెంటు కోతల వల్ల పరిశ్రమలు మూతప డి వేలాదిమంది రోడ్డునపడుతున్నారని.. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్‌కోతల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తామని హామీ ఇచ్చారు.

వికలాంగులకు రూ 1500 పిింఛను టీడీపీ అధికారంలోకి వస్తే వికలాంగులకు రూ 1500 పింఛను ఇప్పించాలని ఒక వికలాంగ యువకుడు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. వెయ్యి నుంచి రూ 1500 వరకు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గణేష్ అనే యువకుడు తాను బీటెక్ చదివి వంద రూపాయలు కూలీ వచ్చినా పని చేయడానికి సిద్దంగా ఉన్నానని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇంజనీరింగ్ చదువుకున్న వారికి ఉన్నత అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చా రు. ఇలా మార్గ మధ్యలో మహిళలు, వృద్దులు, వికలాంగులు, ఆర్ఎంపీ డాక్టర్లు, ఉద్యోగ సంఘాల నేతలు చంద్రబాబును కలసి తమ సమస్యలు విన్నవించారు.

మిమ్మల్నే గెలిపిస్తాం.. కష్టాలు తీర్చండి: వచ్చే ఎన్నికల్లో మీకే ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తాం. మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి. అని ఒక మహిళ చంద్రబాబును వేడుకుంది. ఎస్సీలకు, పేదలకు దక్కాల్సిన స్థలాలను కాంగ్రెస్ నేతలు కబ్జాలు చేశారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ వస్తే ఖచ్చితంగా ఇళ్లులేని వారికి ఇళ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలా అనేక హామీలు కురిపించారు.