March 23, 2013

రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్

రొంపిచర్ల: కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. మండలంలోని నలగార్లపాడు, మాచవరం గ్రామాలలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన పర్యటించారు. విలేకరులతో మాట్లాడుతూ రైతులు వద్ద ధాన్యం, మొక్క జొన్న, పత్తి, మిరప పంటలు ఉన్న సమయంలో ధరలు ఉండవని, దళారులు, మిల్లర్లు చేతిలోకి వెళ్ళగానే ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు. బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ కోసం రూ.100 కోట్లు ప్రకటించారని, ఇవి సరిపోవన్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రిగా వున్న రాజశేఖరరెడ్డి రూ 500 కోట్లు ప్రకటించినా అవి కేటాయించ లేదన్నారు.

రైతులు కొనుక్కొనే విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగాయన్నారు. ధరలు పెరిగితే కొనే వారికి ఇబ్బందులు వుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించు కోవటం లేదన్నారు. స్థానికంగా వున్న మంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడాను అంటున్నారు కాని సాగు నీరు, తాగు నీరు ఇప్పించటంలో విఫలమయ్యారన్నారు. గ్రామంలోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి డాక్టర్ కోడెల పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మెట్టు వెంకటేశ్వరరెడ్డి, చిరుమామిళ్ళ బ్రహ్మయ్య, కోనేటి శ్రీనివాసరావు, పొనుగోటి రామారావు, కుంపటి రవి, ఉడతా రమణ, వడ్లమూడి శివరామయ్య, పులిమి రామిరెడ్డి, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అబ్రహం, మరియమ్మ విగ్రహాలను

ఆవిష్కరించిన మాజీ మంత్రి డాక్టర్ కోడెల

మండలంలోని నలగార్లపాడు గ్రామంలో శుక్రవారం గ్రామానికి చెందిన చల్లా అబ్రహం, మరియమ్మ విగ్రహాలను మాజీమంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆవిష్కరించారు. అనంతరం గ్రామానికి చెందిన అనారోగ్యంతో వున్న కంచేటి సైదయ్యను పరామర్శించారు.