March 23, 2013

ఏలేరు శిలాఫలకం వద్ద టీడీపీ నాయకుల ధర్నా

ప్రత్తిపాడు: రూ.326 కోట్లు వ్యయంతో ఏలేరు ప్రాజెక్టును, సాగునీటి వ్యవస్ధను పూర్తి స్ధాయిలో ఆధునీకరించాలని డిమాండ్‌చేస్తూ పిఠాపురం, ప్రత్తిపాడు టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. మండలంలోని ధర్మవరం గ్రామం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 138 కోట్లు వ్యయంతో ఏలేరు పనుల కోసం ఆవిష్కరించిన శిలాఫలకం వద్ద శుక్రవారం పిఠాపురం, ప్రత్తిపాడు టీడీపీ నాయకులు చెవులలో పువ్వులు ధరించి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పిఠాపురం, ప్రత్తిపాడు రెండు నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన టీడీపీ బృందాలు ధర్మవరం శివారు అడ్డురోడ్డు జంక్షన్ వద్ద ఉన్నఏలేరు ఆవిష్కరణ శిలాఫలకం రాయి వరకు పాదయాత్ర జరిపి అ క్కడ గంటపాటు నిరసన ఆందోళన కొనసాగించారు.

ఈ సందర్బంగా ఆందోళనకు నాయకత్వం వహించిన పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి ఎస్‌విఎస్ వర్మ మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణకు ప్రభుత్వం ప్రస్తుతం రూ.5కోట్లు నిధులతో పనులుచేపట్టి అసంపూర్తి పనులతో చేతులు దులుపుకోవాలని చూస్తుందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్ధాయి ఆధునీకరణకు రూ.326 కోట్లు అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు కేటాయిస్తూ నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు జాప్యం వలన పిఠాపురం నియోజకవర్గ రైతాంగం ముఖ్యంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందున్నారు. ఈ ప్రాజెక్టు మరమ్మత్తు పనుల కోసం గతంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున ఉద్యమాలుచేపట్టిందని వర్మ తెలిపారు. ధర్మవరంలో శిలాఫలకం ఆవిష్కరించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఏలేరు ఆయకట్టు రైతులను మోసగించారని, ప్రభుత్వం ప్రస్తుతం అ రొకర నిధులు కాలయాపనలతో ఆయకట్టు రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్నారని వర్మ విమర్శించారు.

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతనాలుగేళ్లుగా ఏలేరుపై నోరు మెదపకుండా ప్రస్తుతం పాదయాత్రలు చేస్తున్నారని వారికి ఏలేరుపై చిత్తవుధ్ది ఉంటే వైఎస్సార్ ఆవిష్కరించిన శిలాఫలకం వద్ద ధర్నాలు చేస్తే బాగుంటుందని వర్మ వ్యాఖ్యానించారు. ఏలేరు కోసం పోరాడేదే టిడిపి పార్టీ ఒక్కటేనని ఆయన స్పష్టంచేసారు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో సుబ్బారెడ్డి సాగ్, చంద్రబాబు సాగర్‌లను నిర్మించి టీడీపీయేనని అలాగే మెట్ట ప్రాంతానికి సాగునీటి అవసరాలు తీర్చే పుష్కర కాలువ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కృషిమేరకు మంజూరైందని వర్మ వివరించారు. చంద్రబాబు సాగర్‌ను టీడీపీ ప్రభుత్వం నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు నిర్మించలేకపోయిందని వర్మ విమర్శించారు.

ఈ ఆందోళనలో పిఠాపురం నియోజకవర్గ టిడిపి నాయకులు మాదేపల్లి రంగబాబు, అల్లుమల్లు విజయ్‌కుమార్, బవిరిశెట్టి రాంబాబు, కిల్లి రవికుమార్, బర్ల అప్పారావు, నెక్కల సత్యనారాయణ, పూడిశెట్టి చంటి, ఎలుబంటి రాజారావు, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు కొమ్ముల కన్నబాబు, దాట్లకృష్ణబాబు, దాట్ల అప్పన్నబాబు, బొల్లు కొండబాబు, సిద్దా సూరిబాబు, మదినే బాబ్జి, గాంధీ, బొల్లు వెంకట్రాజులు పాల్గొన్నారు.