March 24, 2013

ఆరుబయట నిద్ర.. పాదయాత్ర

హైదరాబాద్ : విద్యుత్ సమస్యపై శాసనసభలో చర్చించాలని ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వినూత్న పద్ధతిలో నిరసనలు తెలిపారు. అసెంబ్లీలో బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అక్కడనుంచి లేపి ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో వదిలిపెట్టిన విషయం తెలిసిందే. తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించుకొన్న ఎమ్మెల్యేలు అక్కడి పచ్చికపైనే ఆరుబయట పడుకొన్నారు. మహిళా ఎమ్మెల్యేలు కాసేపటికి లోనికి వెళ్లి గదుల్లో పడుకొన్నా.. పురుష ఎమ్మెల్యేల్లో అత్యధికులు బయటే గడ్డిలో కింద పడుకొన్నారు.

కనీసం దిండు కూడా లేకుండా పడుకోవడంతో కొందరికి పొద్దున్న లేచేసరికి మెడ, వెన్ను పట్టేశాయి. మండవ వెంకటేశ్వరరావు, రామునాయుడు లాంటివారు ఎదురుగా ఉన్న కేబీఆర్ పార్కుకు ఉదయం నడకకు వెళ్లారు. పల్లె రఘునాధరెడ్డి, ధూళిపాళ నరేంద్ర తదితరులు ఎన్టీఆర్ భవన్ ఆవరణలోనే కాసేపు యోగాసనాలు వేశారు. అక్కడ బయటే దంత ధావనం చేసుకొన్న ఎమ్మెల్యేలు స్నానపానాదులు కూడా అక్కడే పూర్తి చేశారు.

తర్వాత అక్కడ నుంచి బయలుదేరి ఎన్టీఆర్ ఘాట్‌కు చేరారు. అక్కడనుంచి పాదయాత్రగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి అనంతరం అసెంబ్లీకి వెళ్లారు. 'విద్యుత్‌పై చర్చను తక్షణం చేపట్టాలి, పారిపోతున్న ప్రభుత్వం డౌన్‌డౌన్, కరెంటు కోతలు నివారించాలి, రైతులు, పరిశ్రమలకు తగినంత కరెంటు ఇవ్వాలి, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలి' అని వారు నినాదాలు చేశారు.