March 24, 2013

విజయవాడ ఎంపీ సీటు కేశినేని నానీకి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్

రాష్ట్ర కమిటీలో చోటు, గన్నవరం సీటుపై హామీ
మండపేటలో విజయవాడ నేతలతో భేటీ

విజయవాడ : లోక్‌సభ ఎన్నికలలో విజయవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రముఖ ట్రావెల్స్ అధినేత కేశినేని నానీకి ఆ పార్టీ అధినేత చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఆదివాసం బస చేసిన చంద్రబాబు.. విజయవాడ నాయకులను పిలిపించి మాట్లాడారు. అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్, కేశినేని నాని, నాగుల్ మీరా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న ఈ సమావేశానికి వెళ్లారు. తొలుత వంశీమోహన్‌ను చంద్రబాబు..బస్సులోకి పిలిపించి అరగంటసేపు మాట్లాడారు. చర్చల సందర్భంగా అర్బన్ బా«ధ్యతలు వదిలేసి.. రాష్ట్ర కమిటీలోకి రావాలని వంశీని ఆయన కోరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవి తన వర్గానికి ఉంటేనే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం తేలికవుతుందని కేశినేని నాని ఇప్పటికే చంద్రబాబును కోరడమే దీనికి కారణమని వివరిస్తున్నాయి. ఈ వర్గాల వాదన ప్రకారం.. చంద్రబాబు కృష్ణాజిల్లా పాదయాత్ర ప్రారంభానికి ముందే కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ సీటుకు హామీ పొందారు. విజయవాడ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర ఖర్చంతా ఆయనే భరించారు. చంద్రబాబు యాత్రకు గుర్తుగా పరిటాల వద్ద కేశినేని నాని సుమారు రూ.70 లక్షల వ్యయంతో పైలాన్ నిర్మించారు. విజయవాడ సీటు తనకే ఖరారు అవడంతో.. అర్బన్ అధ్యక్ష పదవి కూడా కావాలని అడిగారు. అందుకు చంద్రబాబు అంగీకరించారు.

ఈ నేపథ్యంలో అర్బన్ అధ్యక్ష పదవి నుంచి వంశీని తప్పించడానికి రంగం సిద్ధం చేశారు. ఆయన స్థానంలో నాని సూచించిన నాగుల్ మీరాను నియమించనున్నట్టు అధినేత స్వయంగా సంకేతాలు ఇచ్చారు. అదేసమయంలో నాలుగేళ్లుగా నగర పార్టీ బాధ్యతలు మోస్తున్న వంశీకి నెమ్మదిగా నచ్చచెప్పి మార్పులు చేద్దామని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకే మండపేట రావాలని కబురు పెట్టారని ఈ వర్గాలు చెబుతున్నాయి. బస్సులోకి పిలిపించుకొని వంశీతో బాబు ప్రత్యేకంగా మాట్లాడారు.

ఎన్నికలలో వంశీ పోటీచేయడానికి కూడా అవకాశం కల్పిస్తానని చెప్పినట్టు సమాచారం. 2009 ఎన్నికలలో వంశీ గన్నవరం సీటుకోసం పట్టుపట్టారు. దాసరి జైరమేష్, బాలవర్ధనరావులను వదులుకోలేని చంద్రబాబు..అప్పట్లో వంశీకి నచ్చచెప్పారు. తనమాట విని ఈసారికి విజయవాడ నుంచి పోటీ చేయాలని, వచ్చేసారి (2014) గన్నవరంలో పోటీకి పెడతానని అప్పట్లోనే హామీ ఇచ్చారు. భేటీ సందర్భంగా ఈ హామీని వంశీ గుర్తుచేసినట్టు తెలుస్తోంది. 'గన్నవరం' వంశీకి ఇచ్చి.. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావును మండలికి పంపడమో లేక విజయా డైరీ మిల్క్ సొసైటీ చైర్మన్‌ని చేయడమో చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యే దాసరి, జైరమేష్‌లతో బాబు మాట్లాడిన తరువాతగానీ దీనిపై స్పష్టత రాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే..వంశీకి గన్నవరం సీటు ఇచ్చేసినట్టు టీవీలలో స్క్రోలింగ్‌లు వచ్చాయి. దాంతో ఎమ్మెల్యే దాసరి తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం. పార్టీ పెద్దలకు ఫోన్ చేసి తాను రాజీనామా చేస్తానని చెప్పినట్టు తెలిసింది. గన్నవరంపై నిర్ణయం తీసుకోలేదని సీనియర్ నేతలు దాసరికి నచ్చజెప్పారు.