March 24, 2013

నియోజకవర్గానికో వృద్ధాశ్రమం- చంద్రబాబు

ఆలమూరు: నియోజకవర్గానికోవృద్ధాశ్రమాన్ని ఏర్పాటుచేసి వృద్ధులకు టీడీపీ అండగా నిలుస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెప్పారు. వృద్ధాప్య పింఛన్ రూ.వెయ్యికు పెంపుదల చేస్తామన్నారు. చంద్రబాబు పాదయాత్రలో భాగంగా శనివారం రాత్రి కొత్తపేట నియోజక వర్గం మడికి శివారు మల్లవానితోటలో చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో దొంగల రాజ్యం నడుస్తోందని, పేదలకు అందాల్సిన పథకాలను వారు దోచుకుంటూ పేదలకు బతుకు భారంగా చేశారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెంపుదల చేసి పేదప్రజలకు పెనుభారంగా మార్చిన ఘనత వారికే దక్కిందన్నారు.

పేదల కష్టాలను తీరాలంటే టీడీపీ ప్రభుత్వం మళ్లీ రావాలని చెప్పారు. పేదల కష్టాలను తీర్చేందుకే వస్తున్నా పాదయాత్ర చేస్తున్న ట్లు ఆయన వివరించారు. పేదలకు సొంత ఇల్లు నిర్మించడానికి రూ.1,5లక్షల కేటాయించి ఇల్లు నిర్మించనున్నామని ఆయన ప్రజల ఉద్దేశించి ప్ర సంగించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం రైతుల రుణాలమాఫీ చేస్తానని చెప్పారు. బంగారం రుణాలను కూడా ఈ మాఫీలోకి తీసుకొచ్చి మీ బంగారాన్ని మీకు అందించే బాధ్యత నాదని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఘనస్వాగతం: కడియం నుంచి ప్రారంభమైన చంద్రబాబు నాయుడు పాదయాత్ర కొత్తపేట నియోజక వర్గం మడికి శివారు మల్లవానితోటలోనికి ప్రవేశించినప్పుడు పూలపై చంద్రబాబును నడిపించి ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, పలువురు నాయకులు పాల్గొన్నారు.