March 24, 2013

మన గ్యాస్ మనకే.. పోరాటానికి సిద్ధంకండి

ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేయకుండా ప్రజలకు నరకయాతన చూపిస్తుందని, కెజి బేసిన్‌లో సహజవాయువును ఇతర రాష్ట్రాలకు అమ్మేసుకుంటూ మన ప్రాంతంలో ఇళ్లకుగానీ, ఫ్యాక్టరీలకు గానీ గ్యాస్ ఇవ్వడంలేదని, ఇక మన గ్యాస్ మనకేనని, దీనికోసం తనతోపాటు అందరూ పోరాటానికి సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. వస్తున్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా శనివారం కడియంలో జరిగిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. ఇక్కడి గ్యాస్ ఇక్కడ ఉపయోగించకపోవడం అన్యాయమన్నారు. ఇక్కడి గ్యాస్‌తో ఇంటింటీకి పైపులైన్ల ద్వారా వంటగ్యాస్‌ను సరఫరా చేయాలని ఆలోచించి ఏర్పాట్లు చేశానన్నారు.

తాను సిీఎంగా ఉండగా 35లక్షల గ్యాస్ సిలెండర్లు ఇచ్చానని, ఇవాళ ఆరుసిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వడంలేదని తెలిపారు.పైగా ఆధార్‌తో అనుసంధానం అంటూ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని చెప్పి, సరైన విధానం కూడా పాటించడంలేదని ఆయన అన్నారు.దీని కోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. కసి పెరగాలని, సమస్యలు పరిష్కరించుకోవాలని, తాము జీవితంగా ఎదగాలనే పట్టుదల పెరగాలన్నారు. ఇక్కడ తనకు మీరంతా ఎన్నో సమస్యలు చెబుతున్నారని, పిల్లకాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ అవినీతికి సంబంధించిన అనేక విషయాలు చెబుతున్నారని, ఎక్కడ ఏమి జరుగుతుందో, ఎవరో ఏంటో అర్ధంచేసుకుంటున్నారని, కానీ పోరాడకుంటే ఉంటే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ఆయన తెలిపారు.32మంది ఎంపిలు ఉన్నారని, జిల్లాలో ఒక కేంద్రమంత్రి కూడా ఉన్నారని అయినా ఒక్క సమస్య కూడా పట్టించుకోని దద్దమ్మలన్నారు..

ప్రజల హక్కులను కూడా కాపాడలేకపోతున్నారని, ఈప్రాంతంలోని గ్యాస్‌తో ఈప్రాంత అవసరాలు తీరాలి కదా అని ఆయన ప్రశ్నించారు. నిత్యాసర సరుకులు పెరిగిపోయాయని, కుటుంబాలలో కనీస అవసరాలు కూడా తీరడంలేదని,దీనికి తోడు మద్యం, నాటు సారా ఏరులైపారడం వల్ల అనేకమంది మందుకు బానిసలైపోతున్నారన్నారు. దీనితో అనేక కుటుంబాలు అల్లకల్లోమైపోతున్నాయన్నారు. అవినీతి , అసమర్ధ ప్రభుత్వం మీద, వైఎస్ కుటుంబ దోపీడిని ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వవైభం వస్తుందని, ప్రజలకష్టాలు తీరుస్తానని ప్రకటించారు. ఎస్‌సిలకు వైఎస్ ఒరగబెట్టింది ఏమీ లేదని, సామాజిక న్యాయం కోసం ఎస్‌సి వర్గీకరణ తెచ్చామని, అలాగని మాలలకు అన్యాయం చేసేది లేదని,మాలలలో కూలీలేఅధికమన్నారు. అటువంటి వారికి అన్నివిధాల న్యాయం చేసి పైకి తీసుకొస్తానని చెప్పారు.

జనాభాలో బీసీలు 50శాతం ఉన్నారని,శెట్టిబలిజలు అంతా పార్టీకి అండగా ఉండేవారి,ఇటీవల కొంతమంది దూరమయినా మళ్లీ పార్టీకిదగ్గ ర చేసుకుంటానన్నారు. ఇంకా యాదవులు, చేనేత కార్మికులు, కుమ్మర, వడ్డి, నాయ్రీబాహ్మణ, విశ్రబ్రాహ్మణ,శాలివాహన, రజక వంటి అనేక కులాలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని అందుకే బీసీ డిక్లరేషన్ చేశామన్నారు. కాపులలో కూడా అధికంగా పేదలు ఉన్నారని,భూములు లేవని, చిన్నచిన్న పనులు చేస్తూ బతుకుతున్నారని,కుటుంబాన్ని మగవాళ్లే పోషించాలని, అందువల్ల అనేకమంది పేదలు ఇబ్బందులు పడుతున్న విషయం తనకు తెలుసన్నారు.అంతేకాక అగ్రకులాలలోని పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి, ఆర్ధికంగా, రాజకీయంగా ,సామాజికంగా వారిని ఆదుకోవడానికి త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నామన్నారు.నీలం తుఫాన్ నష్టం కూడా ఇంకా ఇవ్వలేదన్నారు.అందువల్ల అందరూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు.