March 24, 2013

వాడుతున్న పూల వనం!

కడియం.. రాష్ట్రానికి వర'మాల'! ఈ ఊరు గుర్తొస్తే.. ముందుగా గుప్పున పూల గుభాళింపు ముక్కుపుటాలను తాకుతుంది. ఆపై నేలంతా పరుచుకొన్ని పూలవనాలు పలకరిస్తాయి. ఇప్పుడు నేను అలాంటి ఒక పూలనర్సరీ మీదగానే నడుస్తున్నాను. కానీ ఏదీ ఆ వైభవం? నర్సరీల్లో పూలూ, పెంపకందార్లూ ఒకేలా కనిపించారు. వాడిపోయిన కొన్ని పూలతోటలను చూసినపుడు మనస్సు చివుక్కుమంది.

నర్సరీ యజమానులు చెప్పిన మాటలు విన్నప్పుడు గుండెలు మెలిపడ్డాయి. కడియం పూలకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. నా హయాంలో ఇక్కడే 2002లో అంతర్జాతీయ పూల ప్రదర్శన జరిగింది. వందలాది దేశాల నుంచి ప్రతినిధులు ఈ ఊరికి వచ్చారు. మన పూల సంపదకు ముచ్చటపడ్డారు. వీలైనన్ని రకాలను వెంట తీసుకెళ్లారు. మరి ఇప్పుడు? " గతంలో ఉన్న రైతు గుర్తింపు ఇప్పుడు లేదు సార్! మమ్మల్నీ వ్యాపారులుగానే పరిగణిస్తారట. రైతు కోటాలో అంతోఇంతో అందుతున్న ప్రోత్సాహకాలనూ ఆపివేశారు. ఇక ఏం పెట్టి పూలను పెంచాలి?'' అంటూ నర్సరీ పెంపకం దార్లు వాపోతుంటే.. నాకూ దిగులేసింది.

చేనేత మగ్గాల లయబద్ధ చప్పుళ్ల మధ్య వీరవరం చేరుకున్నాను. ఇప్పటిదాకా ఎక్కడకు వెళ్లినా పూలదండల స్వాగతం లభించింది. కానీ, ఈ ఊరి నేతన్నలు మాత్రం నూలు దండలతో అభిమానం చాటుకున్నారు. పేరుకు రుణమాఫీ చేసినా..సొసైటీలకు అందిన దానిలో నూరోవంతు కూడా ఈ నేత కార్మికులకు దక్కలేదు. కానీ, ఈపేరుతో ఐదేళ్లుగా ప్రభుత్వం దగా చేస్తున్నదట! ఆత్మహత్యలు తప్ప దారి కనిపించడం లేదట! నూలుదారం తెగితేనే భరించలేని ఈ సున్నిత మనుషులపై ఇంత నిర్దయా?