March 24, 2013

ఎమ్మెల్యే యాదగిరి మృతితో జిల్లాలో విషాదం

గర్మిళ్ల: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి అనారోగ్య కారణాలతో శనివారం మృతి చెందడంతో జిల్లాలో విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పొగాకు యాదగిరి శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఓ ఆ స్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మంచిర్యాలకు చెందిన యాదగిరి బీఎస్సీ వరకు మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించిన అనంతరం ఎల్ఎల్‌బీ పట్టాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందా రు. లక్షెట్టిపేటలో కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన ఆయన తొలిసారిగా 1983లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి జిల్లా అధ్యక్ష పదవిని అలంకరించారు.

1984లో క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా, పే అండ్ అకౌంట్స్ విభా గం సభ్యుడిగా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా తదితర ఐదు పదవులను ఏకకాలంలో నిర్వహించారు. గతంలో ఒక పర్యాయం ఎమ్మెల్సీగా ఉన్న యాదగిరి మంచిర్యాల మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆరు సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో రిసెప్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్న సమయంలో మంచిర్యాల టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేశారు.

యాదగిరి మృతితో టీడీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గోనె హన్మంతరావు , సీనియర్ నాయకులు ముకేష్‌గౌడ్, కొండేటి సత్యం, వినయ్ ప్రకాష్‌రావు, రైసా బాను, డాక్టర్ రఘునందన్, నల్మాస్ కాంతయ్య, బెల్లంకొం డ మురళి, గాదె సత్యం, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, కార్యదర్శి రంగు మల్లేష్, ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు ఆయన మృతిపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. యాదగిరి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. కడసారి చూపు కోసం వారంతా హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. యాదగిరికి భార్య సునీతతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.