March 24, 2013

వైసీపీ ఎమ్మెల్యేలపై మోత్కుపల్లి మండిపాటు

ఏ మొహం పెట్టుకుని నిరసన?

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుత కరెంటు కోతలు.. చార్జీలకు వైఎస్ రాజశేఖరరెడ్డి దిక్కుమాలిన విధానాలే కారణమని, ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు ఏ మొహం పెట్టుకొని పోడియం వద్దకు వచ్చి గొడవ చేస్తున్నారని టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. తమపార్టీ ఎమ్మెల్యేలు ముద్దుకృష్ణమ నాయుడు, పల్లె రఘునాధరెడ్డి, మల్లెల లింగారెడ్డి, ఎల్.రమణతో కలిసి ఆయన శనివారం టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ అంశంపై చర్చను టీడీపీ తరఫున పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో మొదలు పెట్టబోతుండగా టీఆర్ఎస్, వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడంతో ఉపసభాపతి సభను వాయిదావేశారు.

"విద్యుత్‌పై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతుందేమోనని మేం సీఎం చాంబర్ వద్ద అడ్డంగా కూర్చొని మరీ చర్చకు ఒప్పించాం. తీరా చర్చ మొదలైన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు దాన్ని అడ్డుకొన్నారు. ప్రైవేటు కంపెనీలకు పెద్దపీట వేసి వైఎస్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇంకా ఏ మొహం పెట్టుకొని పోడియం వద్దకు వచ్చారు? అవినీతితో ఇప్పటికే మీ మొహాలు నల్లగా మారిపోయాయి. మళ్ళీ మీకు నల్లచొక్కాలా? మీరే కాంగ్రెస్...కాంగ్రెసే మీరు. ఇక కాంగ్రెస్‌ను ఏమని తిడతారు? తల్లి కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్ బాగోతం బయటపడుతోంది. ఈ రెండు కాంగ్రెస్‌ల సంగతి మేం తేలుస్తాం'' అని ఆయన హెచ్చరించారు.

టీడీపీ హయాంలో రాష్ట్ర బడ్జెట్ రూ. 45 వేల కోట్లు ఉంటే అందులో విద్యుత్ కోసం రూ. 8 వేల కోట్లు కేటాయించారని, కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం మొత్తం బడ్జెట్ రూ. 1. 61 లక్షల కోట్లు ఉంటే అందులో విద్యుత్‌కు కేవలం రూ. 3.5 వేల కోట్లు మాత్రం కేటాయించిందని ముద్దు కృష్ణమ పేర్కొన్నారు. 'చంద్రబాబు రూ. 500 కోట్ల మేర చార్జీలు పెంచితే వైఎస్ పెద్ద గొడవ చేశారు.

ఇప్పుడు పెంచింది రూ. 31 వేల కోట్లు. అప్పట్లో చంద్రబాబు యూనిట్ కరెంటును ప్రైవేటు వారి నుంచి రూ. 1.80కి కొనాలని ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5.50కి కొంటోంది. చంద్రబాబు తను అధికారంలో ఉండగా ఐదున్నర వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో కేవలం 1700 మెగావాట్లు పెంచింది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను నాశనం చేశారు' అని ఆయన విమర్శించారు.