March 24, 2013

ఎన్నికల్లో పోటీపై తుది నిర్ణయం అ«ధిష్టానానిదే - బాలకృష్ణ

తుని: తాను ఎన్నికల్లో పోటీ చేయడంపై తుది నిర్ణయం అధిష్ఠానందేనని సినీ నటుడు బాలకృష్ణ స్పష్టం చేశారు. శనివారం ఆయన తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అల్లుడు లోకేష్,కుమార్తె బ్రహ్మిణిలతో పాటు చంద్రబాబు దంపతుల పేరిట గోత్ర నామాలతో పూజాధికాలు జరిపించారు. విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గం ద్వారా లోవ విచ్చేసిన బాలయ్యకు తుని వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల కృష్ణుడు,పోల్నాటి శేషగిరిరావు, సుర్లలోవరాజు, యినుగంటి సత్యనారాయణ, మేకా రామ్మూర్తి(చిన్నా), పప్పు సత్యనారాయణ, నడిగట్ల సూరిబాబు తదితరులతో పాటు అభిమాన సంఘాల నాయకులు బొబ్బిలి వెంకటరమణ, తిరుమలనీడి రాజు, నడిగట్ల రాజు, రామకుర్తి బాబ్జీ తదితరులు పూలమాలలతో ఎదురేగి ఘన స్వాగతం పలికారు.

అమ్మవారి దర్శనానంతరం విలేకరులతో కాసేపు మాట్లాడారు. తాను ఎంపీగా పోటీ చేయబోనని, ఎమ్మెల్యేగా మాత్రమే పోటీచేస్తానన్నారు. ఎక్కణ్నుంచి పోటీ చేసేది అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు. కొంత సమయం విశ్రాంతి తీసుకుని తుని పట్టణంలోని తన మిత్రుడు చల్లకొండ రమేష్ ఇంటికి చేరుకుని భోజనంచేసి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం విశాఖ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. ఆయన వెంట బండారు జగన్, దిబ్బా శ్రీను, దియ్యా శ్రీను, గర్లంక నానాజీ, పలివెల శివమణి తదితరులు వెళ్లారు. అడుగడుగునా అభిమానులు హర్షాతిరేకాలతో బాలయ్య పర్యటన సాగింది