February 6, 2013

మునిగేది మోసం.. మిగిలేది ముంచే!

ఇదంతా నదీగర్భ ప్రాంతం. కృష్ణమ్మ కన్నెర్ర చేస్తే ఇక్కడి బతుకు చిగురుటాకులా వణికి పోతుంది. చిన్న చినుకుకే చింతిల్లుతుంది. ఎక్కడెక్కడి వాన నీళ్లకూ, మురుగుకూ లోగట్టున ఉన్న ఆ కాలనీలే కాలువ దారులు. రామలింగేశ్వర నగర్, కృష్ణలంక ప్రాంతంలో సాగు తున్నప్పుడు కన్న దృశ్యాలివి. విన్న సంగతులివి. ఇక్కడ నివసించే వారిలో లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఎక్కువ. ఒక్క ట్రిప్పు పోయిరావడానికి నెల రోజుల పైనే పడుతుందట. కోల్‌కతా దాకా పోతామని చెప్పుకొచ్చారు. కృష్ణానదికి వరదలు రావడం, నిర్వాసితులు కావడం ఏడాదికి ఒకసారైనా జరుగుతుంది. వరద వచ్చినప్పుడల్లా బస్టాండ్లూ, పాఠశాలలే వీళ్లకు గతి. అలాంటప్పుడు కుటుంబంలోని మగవాళ్లు లారీ పనికి పోతే, ఆ ఇల్లాళ్ల అవస్థ అంతాఇంతా కాదు. చేతికి అందిన వంటపాత్రలను ఒకచేతితో, బిడ్డలను మరో చేతితో పట్టుకొని ఇంటి నుంచి బయటపడటం ఎంత కష్టం!

ఎన్ని వాగ్దానాలు.. ఎన్నెన్ని హామీలు. కృష్ణమ్మకు రిటైనింగ్ వాల్ కడతామని ఎంత నమ్మబలికారు? దానివల్ల వరద ప్రమాదాన్ని నివారించొచ్చునని చెబితే ఈ జనం నమ్మారు. బతుకును సురక్షితం చేసే చర్యలు తీసుకుంటామని చెప్పిన వాళ్లంతా ఇప్పుడు గాలికి వదిలేశారు. పన్నులు కట్టించుకునేప్పుడు, సర్‌చార్జీలు మోపేటప్పుడు తప్ప వీరికి పౌర ఉనికే లేదు. విజయవాడలోకి వచ్చి నాలుగు రోజులు. ఈ కాలమంతా ఇలాంటి వాళ్లే ఎదురయ్యారు. నా వెంట నడిచారు. చేతులు పట్టుకొని వెతలు వెళ్లబోసుకున్నారు.

నన్ను తమ తోబుట్టువులా ఆదరించారు. నగరంలోకి వచ్చినప్పటి నుంచి వీడిపోయే క్షణం వరకు ఈ జనం కనబరిచిన స్పందన అనేకసార్లు ఉద్వేగానికి గురిచేసింది. ఇదివరకు నేను అనేకసార్లు విజయవాడలో పర్యటించాను. కానీ, ఇలాంటి అభిమానం చవిచూడలేదు. ఆడపడుచు కంట్లో కసిని, కుతకుత ఉడుకుతున్న పేదోడి గుండెమంటని దగ్గరగా చూశాను. ఎప్పటికైనా ఈ కృష్ణలో మునిగేది మోసం.. పైకి లేచేది మంచితనమే!