February 5, 2013

ఎప్పటికైనా కాంగ్రెస్‌లో కలిసిపోయేవాడే

న్యాయమూర్తులనూ.. బెదిరిస్తున్నారు!
పత్రికను అడ్డుపెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్
మీడియాపైనా దాడులు
రాష్ట్ర మంతటా పులివెందుల రాజకీయం
విజయవాడ పాదయాత్రలో బాబు ధ్వజం
కేసుల మాఫీ కోసమే రాజకీయాలు
ఎప్పటికైనా కాంగ్రెస్‌లో కలిసిపోయేవాడే
అధికారంలోకి వస్తే పది సిలిండర్లు ఇస్తా
గ్యాస్‌ను ఆధార్‌కు లింక్ చేస్తే ఉద్యమమే..
నేడు గుంటూరుకి 'మీ కోసం'

న్యాయ వ్యవస్థపై పిల్ల కాంగ్రెస్ (వైసీపీ) దాడి చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. పత్రికను అడ్డం పెట్టుకుని ఆ పార్టీ నాయకులు కోర్టులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థను బెదిరించడం ద్వారా తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు చూస్తున్నారంటూ.. హైకోర్టు జడ్జి ఉదంతంలో జగన్ పత్రికకి, దాని వ్యవస్థాపకుడికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమటలంక వద్ద మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రామలింగేశ్వరనగర్, గీతానగర్, రాణిగారితోట ప్రాంతాల గుండా యాత్ర సాగించారు.

ఈ సందర ్భంగా రాణిగారితోటలోని చలసాని నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. వైసీపీ నేతలు..తమ పార్టీలో చేరని వారిని బెదిరించటమే కాకుండా, వాస్తవాలను బహిర్గతం చేసే మీడియాను సైతం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. సహకార సంఘాల ఎన్నికలలో ఆ పార్టీ సత్తా తేలిపోయిందని ఎద్దేవా చేశారు. "రేపు తల్లి కాం గ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు కలిసిపోయినా ఆశ్చర్యం లేదు. కేసుల మాఫీ కోసమే ఈ రాజకీయమంతా. రాష్ట్రమంతా పులివెందుల మార్కు రాజకీయాలు చేస్తున్నారు'' అని నిప్పులు చెరిగారు.

తన రాజకీయ చరిత్రలోగానీ, అధికారంలో ఉండగా గానీ ఏనాడూ పత్రిక కానీ, టీవీ కానీ పెట్టాలన్న ఆలోచన చేయలేదన్నారు. తనపై వైసీపీ.. సుప్రీం కోర్టుకు కూడా వెళ్లిందని, తప్పు చేయలేదు కాబట్టే కేసును తీసుకోలేదన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో గ్యాస్ నిక్షేపాలున్నా.. బయటకు వెళ్లిపోతున్నాయే తప్ప రాష్ట్రంలోని మహిళల వంటగ్యాస్ కష్టాలు మాత్రం తీరటం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ అధికారంలోకి రాగానే ఏడాదికి 10 సిలిండర్లు ఇప్పించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆధార్ కార్డులతో రేషన్, గ్యాస్, పెన్షన్‌లకు లింకు పెట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపడుతుందని చెప్పారు.

నేడు గుంటూరుకి 'మీ కోసం..'
కృష్ణా జిల్లాలో పాదయాత్ర బుధవారం ఉదయంతో ముగియనుంది. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన బస్టాండ్ సమీపంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా గుంటూరు చేరుకుంటారు. ప్రకాశం బ్యారేజీ ఆవల చంద్రబాబుకు పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి గుంటూరు జిల్లా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11 గంటల మధ్య సమయంలో జిల్లాలోకి అడుగుపెట్టవచ్చునని భావిస్తున్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని సీతానగరం నుంచి ప్రారంభయ్యే చంద్రబాబు పాదయాత్ర ఐదో నెంబరు జాతీయ రహదారి వెంట కొనసాగుతుంది. మంగళగిరితో పాటు పొన్నూరు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో సుమారు 150 కిలోమీటర్ల పొడవున పాదయాత్ర జరుగుతుంది. ఇంచుమించు 15 రోజులకు పైగా సాగే యాత్రలోభాగంగా, 55 గ్రామాలు, నాలుగు పురపాలక సంఘాలు, గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని 30 డివిజన్లలో నడుస్తారు. రెండువేల కిలోమీటర్ల మైలురాయిని ఈ జిల్లాలోనే అధిగమిస్తారు. ఎనిమిది నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

ఈసారి సాక్షి టార్గట్?

లోకేశ్ హాట్ హాట్ ట్వీట్‌హైదరాబాద్, ఫిబ్రవరి 5 : ట్విట్టర్‌లో తన సంక్షిప్త సందేశాలతో అప్పుడప్పుడూ రాజకీయ వేడి పుట్టిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ మంగళవారం జగన్ మీడియాపై హాట్ హాట్‌గా ట్వీట్ చేశారు. జస్టిస్ రమణ కేసులో సుప్రీం కోర్టు బెంచి జగన్ పత్రిక సాక్షిని తప్పుబట్టడాన్ని లోకేశ్ పరోక్షంగా ఈ ట్వీట్‌లో ప్రస్తావించారు. 'వేధించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి, బురద చల్లడానికి సాక్షిని ఒక పనిముట్టుగా వాడుకొంటున్నారని ఇటీవల తన తీర్పులో సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సాక్షీ...మీ తర్వాతి వ్యాసం సుప్రీం కోర్టు బెంచి పైనేనా' అని ఆయన ట్వీట్ చేశారు.