February 5, 2013

పాదయాత్ర మీకోసమే

అరవై మూడెళ్ల వయస్సులో నేను నిస్వార్ధంగా చేస్తున్న ఈ పాద యాత్ర నా కోసం కాదు.. మీ కోసమే అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలనుద్దేశించి అన్నారు. తూర్పు నియోజకవర్గంలో చుట్టుగంట నుంచి ప్రారంభమైన పాదయాత్ర సోమవారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ముగిసింది. దేవినేని చంద్రశేఖర్, అనీల్‌లను చంద్రబాబు పార్టీ కండవాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నట్లు ప్రకటించారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభలో బాబు మాట్లాడారు. ప్రజల ఇబ్బందులను, కష్టాలను దూరం చేయడానికి గాడి తప్పిన పాలనను దారిలో పెట్టడానికి నేను ఈ యాత్ర చేస్తున్నాను. కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ పుట్టిన జిల్లా. ఇక్కడ చైతన్యం ఎక్కువ. అటువంటి మహాపురుషుడు పార్టీ పెట్టి ఢిల్లీ పెద్దలకు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని రుచిచూపించిన వైనం మీ కందరికి గుర్తుండే ఉంటుంది.

రాష్ట్రంలో మార్పు వచ్చిందంటే అది కృష్ణాజిల్లాలో విజయవాడ నగరం నుండే ప్రారంభం అయివుంటుందని అని చెప్పారు.అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు. ఈ రోజు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం విజయవాడ నుంచి ప్రారంభించాల్సిఉంది. అందు కోసం ప్రతి ఒక్కరు ఒక బొబ్బిలిపులి, చండశాశనుడు, కొండవీటి సింహం కావాలని పిలుపునిచ్చారు. తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉంటూ రాక్షస పాలన చేస్తున్న తల్లి కాంగ్రెస్ ఒక పక్క, పిల్ల కాంగ్రెస్ ఒక పక్క కలిసి విషం కక్కడానికి సిద్ధం అవుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలను ఇప్పటికి 29సార్లు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికుందని దుయ్యబట్టారు. గ్యాస్ కోనే పరిస్థితి లేదు. రెండు వందల రూపాయాలకు గ్యాస్‌ను నేను ఇస్తే ఇపుడు నాలుగు వందలు చేశారు. ఆరు సిలెండర్లంటారు, సబ్సిడీ బ్యాంకులో వేస్తాం అంటారు. తీరా మొత్తం ఎత్తేస్తారు జాగ్రత్త అమ్మా అంటూ మహిళలకు అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.

కృష్ణా, గోదావరి జిల్లా నుంచి గ్యాస్ వస్తోంది కానీ ఇక్కడ గ్యాస్ ధర మాత్రం ఆకాశాన్నంటుతుదన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగాయి, బియ్యం కిలో 50 రూపాయాలయ్యాయి, ఉల్లి పాయలు కిలో 40 రూపాయాలయ్యాయి. నా హయాం లో బియ్యం కిలో 12 రూపాయాలు ఉండేవి. ఇపుడు ఉప్పు 10 రూపాయాలు. అపుడు కిలో రెండు రూపాయలే. తలుచుకుంటేనే పేద వాడి కంట్లో కన్నీరు వస్తుంది. 1994- 2004 మధ్య కరెంటు కోత అంటే ఎంటో రాష్ట్రానికి తెలియదు. మరి ఇపుడో అంటూ జనం నుంచి ప్రతిస్పందన కోరారు. దీనికి పెద్ద పెట్టున ఇపుడంతా కొతలే అంటూ నినాదాలు చేశారు. కరెంటు బిల్లులు చూస్తే గుండెలు పగిలిపోతాయి. చెన్నై కలకత్తా రహదారిని మనం వేస్తే వారు వేశామని ఇపుడు తిరుగుతున్నారంటూ ఎగతాళి చేశారు.

భవిష్యత్‌ను అంచనావేసి రోడ్లను వెడల్పుచేస్తే అప్పుడు వద్దని గొడవ చేసి ఇపుడు ఇది తమ ఘనతగా చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ వారిని ఎగతాళి చేశారు. చాలా ఇళ్లల్లో మరుగు దొడ్లు లేవు. కొండ ప్రాంతంలో చాలా మంది పేదలు ఉంటున్నారని వారందరికి ఇళ్ల జాగాలు ఇస్తాను, లక్షా యాభై వేలతో స్వంత ఇల్లు కట్టిచ్చి ఇస్తానని హామి ఇచ్చారు. పాచి పనులు, తోపుడు బండ్లు, ఆటోలు, లారీలు నడుపుకుంజూ జీవించే పేదలు ఇక్కడ మూడు లక్షల మంది ఉంటారు. వారందరికి మేలు చేసే కార్యక్రమాలు చేపడతానన్నారు. కొండ ప్రాంతాలలోనివాసం ఉండే ప్రజలకు ఉచితంగా ఇళ్లస్థలాలు ఇస్తాను, ఉచితంగా రిజిస్ట్రేషన్‌లు చేయిస్తానని అన్నారు. వృద్దులకు 600 రూపాయాల పెన్షన్, వితంతు, వికలాంగ ఫించన్‌లు ఇస్తానన్నారు. డ్రైవర్‌లందరికి ఐదు లక్షల విలువవైన భీమా చేయిస్తా...వారి ప్లిలలకు ఉచిత విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తానని హామి ఇచ్చారు. విజయవాడ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి గుండెకాయ వంటిది, కాని కాంగ్రెస్ వచ్చాక ఈ ఇండస్ట్రీని భ్రష్ఠు పట్టించారన్నారు. కృష్ణా నది పక్కనే ఉండి కూడా ఆటోనగర్‌కు మంచినీరు ఇవ్వలేకపోవడం కంటే సిగ్గుచేటన్నారు.

నేను అధికారంలోకి రాగానే మొదటి సంతకం రైతు రుణాల మాఫీ ఫైలు మీద, రెండోసంతకం బెల్టుషాపుల రద్దు ఫైలు మీద, మూడో సంతకం ఎన్టీయార్ సుజల స్రవంతి పేరుతో ప్రతి గ్రామానికి మంచినీటిని అందించే ఫైలు మీద సంతకం చేస్తానన్నారు.ఇక నాలుగో సంతకం డ్రైవర్‌ల కోసం ఒక ప్రత్యేక పాలసీ తీసుకొచ్చే ఫైలుమీద చేస్తానని ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల గురించి డ్రైవర్‌లు చెబుతూ డొక్కు బస్సులు తోలలేకపోతున్నామని తన దృష్టికి తీసుకొచ్చారని, తాను అధికారంలోకి వస్తే వారికి ఇబ్బందులు ఉండవని హామి ఇచ్చారు.నా ఆరోగ్యం సహకరించకపోయినా..

ఒక సదాశయం కోసం నేను పాదయాత్ర చేస్తున్నా. ఈ క్రమంలో కుడి కాలు, తరవాత ఎడమకాలు చిటికిన వేలు తీవ్ర ఇబ్బంది పెడుతున్నా ఆగడం లేదు. మీ గురించి ఆలోచించి వత్తిడి పెరిగి వంట్లో షుగర్ లెవల్ పెరిగింది. నాకు ఆత్మ విశ్వాసం ఉంది. ఈ సమస్యలు నన్నేం చేయలేవు అని నవ్వుతు చెప్పారు.

*ప్రజలతో ముఖా ముఖి చివరలో ఆయన సభకు హజరైన వారితో ముఖాముఖి నిర్వహించారు. సభికుల నుంచిఅప్పటికపుడు కొందరికి మైకు ఇప్పించి అవినీతి నిర్మూలన మీద వారి అభిప్రాయాలను అడిగారు. ఈ సందర్భంగా ఒక మాజీ సైనికుడు మాట్లాడుతూ దేశం వెలుపల మేం కాపలా కాస్తుంటే దేశం లోపల అవినీతి పరులు పెరిగిపోతున్నారని అన్నారు. మరోక మహిళ మాట్లాడుతూ అవినీతికి అందరూ అలవాటు పడుతున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించాలని అన్నారు. వేముల పల్లి శ్రీ లక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ ఇలాంటి వ్యవస్థను మీరు మార్చాలంటే చాలా కష్టమని చెప్పింది. ఇంజనీరింగ్ విద్యార్థి ఒకరు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నాడు. మరో మహిళ మాట్లాడుతూ మహిళల్లో చీరలకు, పురుషుల్లో క్వార్టర్‌లకు లొంగిపోయేవారు ఉన్నంత కాలం మీలాంటి నిస్వార్ధ పరులు మరలా అధికారంలోకి రాలేరని అన్నారు. వీరందరికి బాబు తనదైన శైలిలో జవాబులు చెప్పారు.