February 5, 2013

గుం'టూరు'కు వచ్చేస్తున్నా..మీ కోసం


గుంటూరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చంద్రబాబు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర తేదీ, సమయం ఖరారైంది. ఈ నెల ఐదో తేదీ రాత్రికే తాడేపల్లి మండలంలోని సీతానగరానికి చేరుకొని బస చేస్తారని పార్టీ వర్గాలు భావించినప్పటికీ విజయవాడలో షెడ్యూల్ ఆలస్యం కావడం వల్ల జిల్లాలోకి ప్రవేశించే తేదీ ఈ నెల ఆరుకు మారింది. టీడీపీ రాష్ట్ర నాయకుడు కంభంపాటి రామ్మోహన్‌రావు సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి వచ్చి నాయకులతో మంతనాలు జరిపినఅనంతరం చంద్రబాబు ఆరో తేదీ ఉదయం 11 గంటలకు ప్రకాశం బ్యారేజ్ మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తారని ప్రకటించారు. గత నెల 26వ తేదీనే చంద్రబాబు జిల్లాలోకి అడుగు పెడతారని నాయకులు తొలుత అంచనా వేశారు. అయితే కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబుకు కాలు నొప్పి తిరగపెట్టడంతో షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది.

కాలు నొప్పి కారణంగా పాదయాత్ర రోజుకు 10 కిలోమీటర్ల లోపే కొనసాగుతోంది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న టీడీపీ జిల్లా నాయకులు చంద్రబాబు ఈ నెల ఆరో తేదీ ఉదయం 11 గంటలకు ప్రకాశం బ్యారేజ్ వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తారని తెలిపారు. గత వేసవికాలంలో వాన్‌పిక్ భూముల్లో పాదయాత్ర చేసిన చంద్రబాబు ఇంచుమించు తొమ్మిది నెలల తర్వాత జిల్లాకు వస్తుండటం, 15 రోజుల పాటు పాదయాత్ర చేయనుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర నేతలు సమావేశమౌతూ పాదయాత్రకు జనసమీకరణపై చర్చలు కొనసాగిస్తున్నారు.

పాదయాత్రలో భాగంగా చంద్రబాబు మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ, తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లోని 55 గ్రామాలు, నాలుగు పురపాలక సంఘాలు, గుంటూరు నగరపాలకసంస్థలోని 30 డివిజన్లలో పర్యటిస్తారు. సొసైటీ ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాలను గెలుచుకొన్న నేపథ్యంలో సహకార విజయాలతో చంద్రబాబుకు జిల్లాలో ఘనస్వాగతం పలుకుతామని నాయకులు చెబుతున్నారు.