February 6, 2013

అదే జోరు..జిల్లాలో బాబు యాత్ర గ్రాండ్ సక్సెస్

చంద్రబాబు ్‌వస్తున్నా .. మీ కోసం* పాదయాత్ర జిల్లాలో గ్రాండ్ సక్సెస్ అయింది. మంగళవారం తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక, రామలింగేశ్వరనగర్ తదితర ప్రాంతాలలో జరిగిన యాత్రకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. మొదటి విడత పాదయాత్ర బుధవారం ఉదయం జిల్లాలో పూర్తికానుంది. విజయవాడ బస్‌స్టేషన్ సమీపంలో ఉదయం తొమ్మిది గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ప్రకాశం బ్యారేజి మీదుగా చంద్రబాబు గుంటూరు చేరుకుంటారు. ప్రకాశం బ్యారేజి ఆవల చంద్రబాబుకు పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి గుంటూరు జిల్లా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో జనవరి 21వ తేదీన చంద్రబాబు నల్గొండ జిల్లా మీదుగా జగ్గయ్యపేట సరిహద్దులోకి అడుగు పెట్టారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం అయితే తొలివిడతగా చంద్రబాబు జిల్లాలో 9 రోజుల పాటు 136 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించాల్సి ఉంది.

కానీ, పాదయాత్ర 17 రోజుల పాటు కొనసాగింది. మధ్యలో కాలి గాయం, ఇతర సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబు నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాలతో పాటు, విజయవాడ నగరం పరిధిలోని పశ్చిమ, మధ్య, తూర్పు నియోజకవర్గాలలో ఆయన నాలుగు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో మొదటి రెండు మూడు రోజులుమినహా చివరి వరకూ ఆరోగ్య సమస్యలతో ఆయన ఇబ్బందులు పడ్డారు. ముందుగా ఎడమకాలి చిటికెన వేలుకు గాయం అయింది. దానికి ఇన్ఫెక్షన్ రావటంతో వాపు మరింత పెరిగింది.

రెండు రోజుల పాటు చంద్రబాబు కుంటుకుంటూ ఓపిగ్గా నడిచారు. పాదయాత్రను ఏ దశలోనూ ఆపటానికి చంద్రబాబు అంగీకరించలేదు. వైద్యులు చెప్పినా వినలేదు. ఆఖరుకు ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్‌లు కూడా వచ్చి వత్తిడి చేశారు. పరిటాల దగ్గర 117 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా 117 అడుగుల పైలాన్ ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు పాల్గొన్న సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబును విశ్రాంతి తీసుకోవాలని ఒత్తిడి చేశారు. దాంతో ఆయన వైద్య పరీక్షల కోసం ఒక్క రోజు విశ్రాంతి తీసుకున్నారు.

తర్వాత వైద్య పరీక్షల అనంతరం మరో మూడు రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయనకు విజయవాడలో గొంతు బాధ పెట్టింది. బహిరంగ సభలలో ఆయన మాట్లాడటానికి గొంతు సహకరించలేదు. అయినా సభకు వచ్చిన భారీ ప్రజానీకాన్ని చూసి గొంతు అతికష్టమ్మీద కూడదీసుకుని ప్రసంగించారు. జిల్లాలో అడుగు పెట్టినది మొదలు చివరి వరకూ బాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలలో బాబు పాదయాత్రలో పల్లెల నుంచి జనం తరలి వచ్చారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు బహిరంగ సభకు రికార్డు స్థాయిలో జనాలు వచ్చారు.

ఆ తర్వాత నందిగామ నియోజకవర్గంలో అంతటి స్పందన కనిపించింది. మైలవరం నియోజకవర్గంలో ప్రధానంగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో చంద్రబాబు సభ అత్యంత భారీగా జరిగింది. ఆ తర్వాత విజయవాడ నగరంలోకి అడుగు పెట్టిన చంద్రబాబుకు ఊహించని విధంగా ప్రజాదరణ లభించింది. గ్రామాల్లో కిలోమీటరు దూరం ఎదురేగి మహిళలు హారతులు ఇచ్చారు. చంద్రబాబు తన ప్రసంగాలలో కరెంటు చార్జీలు, నిత్యావసరాలు, వ్యవసాయం గిట్టుబాటు ధరలు, రైతుల ఇబ్బందుల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. నగరంలో కార్పొరేషన్ సంబంధిత సమస్యలు, నగరాభివృద్ధికి ఆటంకం వంటి సమస్యలపై ప్రధానంగా స్పందించారు. అటు రూరల్ , ఇటు నగరంలో కామన్‌గా అవినీతిపై చంద్రబాబు విల్లు ఎక్కుపెట్టారు. జిల్లాలో బాబు పాదయాత్రతో పాటు ముఖాముఖి కార్యక్రమాలు జరిగాయి.

అవినీతిపై ఇంజనీరింగ్, సాధారణ కళాశాలల విద్యార్థులతో మీట్‌లు జరిగాయి. రైతులతో రైతు సదస్సు, ఆటోమొబైల్ - రవాణారంగ ప్రతినిధులతో మీట్ జరిగింది. పట్టభద్రులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరులో చంద్రబాబు దాదాపుగా 14 రోజుల పాటు పాదయాత్రను కొనసాగిస్తారు. ఆ తర్వాత మలివిడతగా రెండవ దఫా చంద్రబాబు మళ్ళీ జిల్లాకు రానున్నాను. రెండవ దఫాలో అవనిగడ్డ, మచిలీపట్నం తదితర ప్రాంతాల మీదుగా పాదయాత్ర జరుగుతుంది.