February 6, 2013

తొలి సంతకం రుణమాఫీ పైనే...

తాడేపల్లి: తెలుగుదేశం అధికారంలోకి రాగానే తొలి సంతకం రైతుల రుణమాఫీలపైనే పెడతానని నారా చంద్రబాబు నాయుడు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. బుధవారం వస్తున్నా.. మీకోసం పాదయాత్రకు జిల్లా విచ్చేసిన చంద్రబాబు తాడేపల్లి ప్రాంతంలోని నులకపేట, ప్రకాష్‌నగర్, ఉండవల్లి ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం హయాంలో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశామని, విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చామని, ఆడపిల్ల పుడితే రూ.5 వేలు ఇచ్చామని, పెన్షన్లు ఇచ్చామని, టెక్నాలజీ పెంచామని చెప్పారు.

రైతాంగం పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో దుర్భరంగా మారిందని, తన హయాంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ రైతాంగానికి నిరాటంకంగా నీరు, తొమ్మిది గంటల విద్యుత్తు ఇచ్చామని చెప్పారు. గ్యాస్ సిలెండర్లపై సైతం పాలకులు కోతపెట్టారని, ఇంతకంటే దౌర్భాగ్యమేముందన్నారు. ఎరువుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని, కాంగ్రెస్ కార్యకర్తలే గ్రామాల్లో ఆదర్శరైతులుగా చెలామణి అవుతున్నారని చెప్పారు. మద్యం బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిపోవడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. కార్యకర్తల కోలాహలం, తోపులాటల మధ్య ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి సెంటరుకు (రెండు కిలోమీటర్లు) రావడానికి బాబుకు రెండు గంటలు పట్టింది.